చేదుకాలం | - | Sakshi
Sakshi News home page

చేదుకాలం

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

బూటకపు హామీలతో మరోసారి మోసం

రైతులను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

కనుమరుగైన చెరకు సాగు

ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి

దీనావస్థలో ఘన చరిత్ర కలిగిన ఏటికొప్పాక చక్కెర కర్మాగారం

పూర్వ వైభవం వస్తుందా?

చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న చంద్రబాబు ప్రభుత్వ హామీ నీటి బుడగే అయ్యింది. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించే ప్రయత్నం చేయకపోగా నడుస్తున్న గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని కూడా మూసివేయించే స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నికల ముందు బూటకపు హామీతో రైతులను చంద్రబాబు సర్కారు మరోసారి బురిడికొట్టించింది. షుగర్‌ ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుంటాయన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతోంది.
చక్కెర పరిశ్రమకు

కోటవురట్ల : ఉమ్మడి విశాఖ జిల్లాల్లో చెరకు సాగు ఓ పండుగలా జరిగేది. వేలాది ఎకరాలలో ఎటుచూసినా చెరకు తోటలే కనిపించేవి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం కాంక్షించి ఏటా గిట్టుబాటు ధరను కల్పించేవారు. ఫ్యాక్టరీ మనుగడకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వచ్చేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఫ్యాక్టరీలను పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో చెరకు సాగు కనిపించకుండా పోయింది. ఓ వెలుగు వెలిగిన షుగర్‌ ఫ్యాక్టరీలు దీనావస్థలో పాలకుల అసమర్ధతను ప్రశ్నిస్తున్నట్టు నిశ్శబ్ధంగా చూస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో దార్లపూడిలో ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ, అనకాపల్లి తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ, చోడవరం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ, పాయకరావుపేట తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలతో చెరకు సాగు భారీగా జరిగేది. కొన్నేళ్లుగా ఈ షుగర్‌ ఫ్యాక్టరీలు ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్నాయి. చివరిగా చోడవరం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ కూడా మూతపడే దశకు చేరుకుంది. కూటమి హామీతో చెరకు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకోగా అవన్నీ నీరుగారుతున్నాయి. పూర్వ వైభవం వచ్చే పరిస్థితి కానరాక చెరకు సాగును పూర్తిగా మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీకి గొప్ప చరిత్ర ఉంది. రైతుల జీవన ప్రమాణాలను మార్చేసిన ఘనత ఈ ఫ్యాక్టరీది. ఆర్థికంగా వెనుకబాటు తనంతో ఉన్న ఈ ప్రాంత రైతుల జీవితాలలో వెలుగు నింపిన ఖ్యాతి దీనిది.

చెరకు సాగుకు పెట్టింది పేరుగా....

ఒకప్పటి విశాఖ జిల్లాలో రైతులకు వేల ఎకరాలు ఉన్నా అంతగా రాబడి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజులవి. 1932 వరకు సంప్రదాయ పంటలతో కాలం నెట్టుకొస్తున్న పరిస్థితులు. వరి, అరటి వంటి పంటలతో గిట్టుబాటు కాక రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడేవారు. ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి శివారున 1933లో స్థాపించబడిన ఈ కర్మాగారం యావత్తు భారతదేశంలోనే సహకార రంగంలో మొట్ట మొదటి చక్కెర కర్మాగారంగా చెబుతారు. ఈ ఫ్యాక్టరీ రాకతోనే ఏటా చెరకు సాగు పెరుగుతూ రైతులకు కొండంత అండగా నిలిచింది. చెరకు సాగుకు పెట్టింది పేరుగా ఈ ప్రాంతం వాసికెక్కింది. 1932లో మద్రాసు సహకార సంఘ చట్టం కింద ది ఏటికొప్పాక కో–ఆపరేటివ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొసైటీ లిమిటెడ్‌ ఏర్పడింది. 1933 ఏప్రిల్‌ 22న రిజిస్టరు కావడంతో పాటు అదే రోజున పని ప్రారంభించారు.

రైతుల ‘సహకారం’ తోడై...

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇదే ప్రప్రథమ సంఘం. అప్పటి మద్రాసు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ మాజీ అధ్యక్షుడు రావుబహద్దూర్‌ సి.వి.ఎస్‌.నరసింహరాజు అధ్యక్షతన రాజాసాగి సత్యనారాయణరాజు ఉపాధ్యక్షుడుగా 20 మంది సభ్యులతో, రూ.8,975 షేరు ధనంతో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ప్రారంభ దశలో రోజుకు 75 టన్నులు చెరకు గానుగ ఆడేవారు. ఆ తర్వాత రైతులు చెరకు పంటపై ఆసక్తి పెంచుకుని భారీగా సాగు చేయడం ప్రారంభించారు. పంటకు గిట్టుబాటు ధర రావడంతో, మైలేజ్‌లు, డివిడెండ్లు చెల్లింపులతో సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1952–53లో సాగు పెరగడంతో 600 టన్నుల సామర్ధ్యం కలిగిన యంత్రాలను అమర్చారు. అప్పటికి 1415 మంది సభ్యులతో, రూ.6,74,195 షేరు ధనం కలిగి ఉంది. క్రమేపీ సాంకేతికతను జోడించి నాణ్యత కలిగిన పంచదారను ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చారు. మార్కెట్లో మంచి గుర్తింపు రావడంతో అనతికాలంలోనే ఫ్యాక్టరీ అభివృద్ధి బాటలో పయనించింది. ఇక వెనక్కి చూసుకోకుండా అంచెలంచెలుగా గానుగాట స్థాయి పెరుగుతూ వచ్చి 2018 నాటికి రోజుకు 2 వేల టన్నుల చెరకును ఆడే స్థాయికి చేరింది. ఫ్యాక్టరీ పరిధిలో 8 మండలాలకు చెందిన 122 గ్రామాల్లోని రైతాంగం చెరకు ఫ్యాక్టరీకి సరఫరా చేసేవారు. ఫ్యాక్టరీ మూతపడే నాటికి 5630 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి తంగేడు రాజవంశీకులతో పర్యవేక్షణలోనే నడిచింది. ఫ్యాక్టరీ అధ్యక్షులుగా 1965–68 వరకు రాజాసాగి సూర్యనారాయణరాజు, 1968–70 వరకు రాజాసాగి సీతారామరాజు, 1970–81 వరకు రాజాసాగి కృష్ణమూర్తిరాజు, 1981–84 వరకు రాజాసాగి రామభద్రరాజు అధ్యక్షులుగా కొనసాగుతూ వచ్చారు.

చంద్రబాబు చెరకు రైతులను ముంచేశారు..

చంద్రబాబు చెరకు రైతుల ఆశలను పూర్తిగా చంపేశారు. ఎన్నికల ముందు బూటకపు హామీతో తుంపాల, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలను ఆధునికీకరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తీరా రెండేళ్లు దాటుతున్నా ఆ ఊసేలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా చెరకు సాగుకు కేంద్రబిందువుగా ఉండేది. కూటమి ధోరణితో చెరకు పంట కనుమరుగైంది. చంద్రబాబు మళ్లీ రైతులను మోసం చేయడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను వెదుక్కుంటున్నారు. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ కూడా మూతపడేలా చేశారు. ఎక్కడి నుంచో వచ్చి దొంగ హామీలు ఇచ్చిన ఎంపీ సీఎం రమేష్‌ జాడే కనిపించలేదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

– ఆర్‌.ఎస్‌.సత్యనారాయణరాజు, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, తంగేడు

టీడీపీ పాలనలోనే దీనస్థితి...

టీడీపీ ప్రభుత్వ పాలనలో చెరకు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2019 నాటికి ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడింది. ఆనాటి నుంచి ఈ ఫ్యాక్టరీని తెరచి చెరకు రైతులను ఆదుకోవాలనే డిమాండ్‌ కొనసాగుతోంది. గత ఎన్నికల ముందు కూటమి ఈ ఫ్యాక్టరీని తెరిపించడమే కాకుండా గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. చంద్రబాబు సర్కారు వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఫ్యాక్టరీ ఊసేలేదు. దాంతో చెరకు రైతులు పూర్తిగా ఆశ చంపుకొని ప్రత్యామ్నాయ పంటగా సరుగుడు పంటను సాగు చేస్తున్నారు. ఘన చరిత్ర కలిగిన షుగర్‌ ఫ్యాక్టరీలు ప్రస్తుతం శిథిలావస్ధకు చేరి దీనంగా చూస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement