నిలిచిన గ్రాంట్లు.. ఉద్యోగులు, పెన్షనర్ల కడుపుకోత ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూపులే.. జీతాలకు ఏయూ అంతర్గత నిధులే దిక్కు అంధకారంలో అక్షర దేవాలయం
విశాఖ సిటీ : చదువుల తల్లి నిలయం.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ’సరస్వతీ పుత్రుల’ కడుపు మండుతోంది. వర్సిటీ శత జయంతి ఉత్సవాల పేరిట పాలకులు ఆర్భాటాలు చేస్తుంటే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మాత్రం పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏయూకు అందాల్సిన గ్రాంట్లు సక్రమంగా అందకపోవడం శాపంగా మారింది. టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల కడుపు మాడుస్తుండడం ఇప్పుడు వర్సిటీలో వివాదాస్పదమవుతోంది. ఉద్యోగుల జీతాల కోసం ప్రతిసారి ఏయూ అంతర్గత గ్రాంట్ నుంచి నిధులు తోడేస్తుంటే.. విశ్వవిద్యాలయం దివాళా తీసేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులే!
ఆంధ్రా యూనివర్సిటీలో సుమారు 300 మంది టీచింగ్, 1400 మంది నాన్ టీచింగ్, 3400 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి జీతభత్యాల కోసం నెలకు దాదాపు రూ.34 కోట్లు అవసరమవుతాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే గ్రాంట్ ద్వారానే ఈ చెల్లింపులు జరుగుతాయి. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ‘అంతా ఉన్నా.. అల్లుడి నోట్లో శని‘ అన్న చందంగా తయారైంది. గ్రాంట్ల విడుదలలో జాప్యం కారణంగా ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతున్నాయి. గత నెల మాదిరిగానే ఈ నెలలో కూడా ఇంతవరకు జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. వందేళ్ల వైభవాన్ని చాటిచెప్పే ఉత్సవాల హడావుడి మధ్య, వేలాది మంది ఉద్యోగుల ఆకలి కేకలు పాలకులకు వినిపించకపోవడం గమనార్హం.
గ్రాంట్ల నిలిపివేత.. ఉద్యోగుల కడుపుకోత
ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో ఆంధ్రా యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్ కేటాయిస్తుంది. ఈ నిధులను త్రైమాసిక ప్రాతిపదికన విడుదల చేస్తారు. ఆ నిధులు ప్రధానంగా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ నిధుల విడుదలకు ఎగనామం పెడుతోంది. దీంతో ఉద్యోగులకు కడుపుకోత మిగులుతోంది. ట్రెజరీ నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో, వర్సిటీ నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ‘ముందు వెనుక చూసుకోకుండా వేడుకలు చేయడం.. ఉన్న ఊరిని ఉత్సవాల పాలు చేయడం’ అంటే ఇదేనని మేధావులు విమర్శిస్తున్నారు.
అంతర్గత నిధులు ఖాళీ..
భవిష్యత్తు అంధకారం
ప్రభుత్వ గ్రాంట్లు రాకపోవడంతో వర్సిటీ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ’అంతర్గత నిధుల’పై చేయి వేస్తున్నారు. గత ఏడాది కాలంలో సుమారు రూ.70 కోట్ల అంతర్గత నిధులను జీతాల కోసం మళ్లించారు. ఆ నిధులను ప్రభుత్వం తిరిగి రీయంబర్స్ చేయకపోవడంతో ఏయూ ఖజానా ఇప్పుడు వెలవెలబోతోంది. ప్రతి నెలా జీతాలు, పెన్షన్ల కోసమే రూ.34 కోట్ల అవసరం ఉండగా, అంతర్గత నిధులు కూడా క్షీణించడంతో ‘కుండలో నీళ్లు లేవు, చేతిలో గిన్నె ఉంది’ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ నెల కూడా ఇప్పటివరకు జీతాలు అందకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. గ్రాంట్ విషయంలో ఉన్నత విద్యా శాఖ అధికారులు కూడా చేతులెత్తేసినట్లు సమాచారం. ఈసారి కూడా అంతర్గత నిధుల నుంచే జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఇలాగే కొనసాగితే వర్సిటీ రోజువారీ నిర్వహణకు కూడా నిధులు ఉండవని, విద్యా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మేధావులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
వందేళ్ల చరిత్ర.. వెయ్యి ఆకలి కేకలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అస్తిత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అక్షరాయుధాలను అందించే సరస్వతీ నిలయంలో, అదే అక్షరాలను దిద్దే గురువులు, సిబ్బంది నేడు పస్తులతో అలమటిస్తున్నారు. ఒకవైపు ’శతాబ్ది ఉత్సవాల’ పేరిట రంగుల హంగులు.. మరోవైపు ఖాళీ జేబులతో ఉద్యోగుల కన్నీటి గాథలు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల కోత వెరసి.. ఏయూ భవితవ్యం ఇప్పుడు అగాధంలో పడింది.
దివాళా దిశగా ఏయూ
ప్రభుత్వం ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న నిధులను కూడా ఖాళీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఉత్సవాలకు ప్రాధాన్యత ఇస్తూ జీతాల చెల్లింపుల్లో విఫలమవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ‘పండగ కోసం అప్పు చేసి పస్తులుండే స్థితి’కి ఏయూ చేరిందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ గ్రాంట్లను విడుదల చేసి, విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మేధావులు సూచిస్తున్నారు. లేకుంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందనే హెచ్చరిస్తున్నారు.


