జిల్లాలో పెరుగుతున్న సిజేరియన్లు భయపెట్టి రూ.లక్షలు లాగేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు గతంలో గీతంలో అధికంగా కత్తెర కాన్పులు భారీ జరిమానా విధించిన అప్పటి కలెక్టర్ ప్రస్తుతం అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే తంతు
దేవరాపల్లి: మండలంలోని నాగయ్యపేటకు చెందిన వేచలపు హర్షిత్ ప్రతిష్టాత్మక గేట్–2026 పరీక్షలో సత్తా చాటాడు. గురువారం విడుదలైన ఫలితాల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్(ఈసీ) విభాగంలో ఆల్ ఇండియా స్థాయిలో 67వ ర్యాంక్ సాధించాడు. జాతీయ స్థాయిలో ఉన్నతమైన ఐఐటీ కాలేజీలో సునాయాసంగా ఎంటెక్ చేయడానికి ఆల్ ఇండియా 67వ ర్యాంక్ సాధించేందుకు దోహదపడుతుందన్నారు. కాగా హర్షిత్ హైదరాబాద్‌లోని ఓ అకాడమీలో శిక్షణ పొందాడు. కాగా హర్షిత్ తండ్రి నరేంద్ర విశాఖ డెయిరీలో మేనేజర్‌గా పని చేస్తుండగా, తల్లి పార్వతీదేవి ఆంధ్ర మెడికల్ కాలేజీలో ట్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఇతని సోదరి శ్రీవర్షిణి శ్రీకాకుళంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ సందర్భంగా హర్షిత్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఐఐటీలో రీసెర్చ్ చేసి ఉన్నత స్థాయిలో స్థిరపడడమే లక్ష్యమన్నారు. తన తల్లిదండ్రులు, సోదరితో పాటు తాను శిక్షణ పొందిన సంస్థ అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంక్ సాధించగలిగానన్నారు. గేట్‌లో ఆల్ ఇండియా స్థాయిలో హర్షిత్ ఉత్తమ ర్యాంక్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
మహారాణిపేట :నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి వెళితే చాలు.. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులకు కాసుల గలగలే. బిడ్డ అడ్డం తిరిగింది.. ఉమ్మనీరు తగ్గిపోయింది.. తక్షణం ఆపరేషన్ చేయకపోతే ముప్పు పొంచి ఉంది అంటూ అప్పటికప్పుడు భయపెట్టి ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తున్నారు. మరోవైపు ఫలానా ముహూర్తానికే మా వంశోద్ధారకుడు పుట్టాలి అంటూ కొందరు మూఢనమ్మకాలతో కత్తెర కాన్పులను కోరుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో సిజేరియన్లు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. పాలిచ్చే తల్లుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నా.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం ఇది లాభసాటి వ్యాపారంగా మారింది.
గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 271 ఆస్పత్రులు ఉండగా, వాటిలో 102 వరకు మాతాశిశు, ప్రసూతి ఆస్పత్రులే ఉన్నాయి. గతంలో గీతం ఆస్పత్రిలో పెద్ద ఎత్తున సిజేరియన్లు జరుగుతున్నాయని గుర్తించిన అప్పటి కలెక్టర్ మల్లికార్జున భారీ జరిమానా విధించారు. అయినా ప్రైవేట్ ఆస్పత్రుల తీరులో మార్పు రాలేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు నమోదైన డేటా ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,518 సిజేరియన్లు(39.84శాతం) జరగ్గా, 4,309 సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏకంగా 6,820 సిజేరియన్లు(60.15 శాతం) జరగ్గా, 4,263 సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సక్రమంగా అందడం లేదన్న అపోహలతో ఎక్కువ మంది ప్రైవేటును ఆశ్రయిస్తుండటమే ఈ దోపిడీకి ప్రధాన కారణం.
ముహూర్తాల మోజులో.
వైద్యుల కాసుల కక్కుర్తి ఒక వైపైతే.. ప్రజల మూఢనమ్మకాలు మరోవైపు సిజేరియన్లకు కారణమవుతున్నాయి. శుభ ఘడియాలు, నక్షత్రాలు, తిథుల ప్రకారం ఫలానా రోజు, ఫలానా సమయానికే బిడ్డ పుట్టాలంటూ పురోహితుల సూచనలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి ముహూర్తాలకు వైద్యులు అంగీకరించరు కాబట్టి, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా, కత్తి కోతలతో తల్లి ఆరోగ్యానికి భవిష్యత్తులోహాని అని తెలిసినా.. ముహూర్తాలకే మొగ్గుచూపుతున్నారు. అమాయక ప్రజల ఈ సెంటిమెంట్‌ను ప్రైవేట్ ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి.
అసలు సిజేరియన్
ఎప్పుడు చేయాలి?
నిజానికి సిజేరియన్ అనేది అత్యవసర పరిస్థితుల్లో తల్లీబిడ్డల ప్రాణాలు నిలపడానికి మాత్రమే చేసే ప్రక్రియ. వైద్య నిబంధనల ప్రకారం బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు, శిశువు బరువు అసాధారణంగా పెరిగినా, కడుపులో అడ్డం తిరిగినా, ఉమ్మనీరు బాగా తగ్గిపోయినా, లేదా శిశువు ఉమ్మనీరు తాగేసినా, తల్లికి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు, కవలలు (ఇద్దరు లేదా ముగ్గురు) జన్మించే సమయంలో ఆపరేషన్ చేయాలి.
దొండపర్తికి చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం కలెక్టరేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రెండు రోజుల తర్వాత ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తొమ్మిది నెలలుగా అంతా బాగుందన్న వైద్యులు.. ఒక్కసారిగా మాట మార్చారు. ‘బిడ్డ అడ్డం తిరిగింది, వెంటనే సిజేరియన్ చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకే ప్రమాదం’అంటూ కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. గత్యంతరం లేక వారు ఆపరేషన్‌కు అంగీకరించారు. తీరా డిశ్చార్జి సమయంలో అన్ని ఖర్చులు కలిపి రూ.1.20 లక్షల బిల్లు చేతిలో పెట్టడంతో ఆ కుటుంబం కంగుతింది. అప్పులు చేసి మరీ బిల్లు చెల్లించాల్సి వచ్చిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఇది కేవలం ఒక్క మహిళ పరిస్థితే కాదు.. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న తంతే!
అంతా కాసుల కోసమే..
సాధారణ కాన్పు జరిగితే రెండు, మూడు రోజుల్లోనే తల్లీబిడ్డను డిశ్చార్జి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆస్పత్రికి వచ్చే ఆదాయం తక్కువ. అదే సిజేరియన్ అయితే కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉంచుకోవచ్చు. గది అద్దెలు, వివిధ ల్యాబ్ పరీక్షలు, మందులు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు.. ఇలా అన్ని రకాలుగా కలిపి రూ.30 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేయవచ్చు. ఈ కక్కుర్తితోనే కొన్ని ఆస్పత్రులు దాదాపు తొమ్మిది నెలల పాటు నార్మల్ డెలివరీ అని నమ్మబలికి, చివరి నిమిషంలో భయపెట్టి సిజేరియన్ల వైపు మళ్లిస్తున్నాయి. దీనిపై ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అనవసర సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


