విశాఖ స్పోర్ట్స్: వాల్తేరు రైల్వే అంతర విభాగాల క్రీడా పోటీలు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాలకు చెందిన రైల్వే ఉద్యోగులు మొత్తం 12 క్రీడాంశాల్లో తలపడనున్నారు. తూర్పు కోస్తా రైల్వే క్రీడా సంఘం(వాల్తేరు) ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏప్రిల్ 30 వరకు జరగనున్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేరుగా టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్, చదరంగం, క్యారమ్స్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో అదనంగా ఫుట్‌బాల్, బాడీబిల్డింగ్, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో అకౌంట్స్, వైద్య, ఆపరేటింగ్, ఇంజనీరింగ్, వాణిజ్య, విద్యుత్, మెకానికల్, పర్సనల్, నిర్మాణ, టెలికాం, డీఎల్‌ఎస్, ఓపీ, టీఆర్‌ఎస్, టీఆర్టీ, జనరల్, ఆర్పీఎఫ్, భద్రత, స్పోర్ట్స్ విభాగాలకు చెందిన 19 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా వాల్తేరు డీఆర్‌ఎం లలిత్ బోహ్రా గురువారం క్రీడా పోటీల పోస్టర్‌ను విడుదల చేశారు. ఏడీఆర్‌ఎంలు కె.రామారావు, క్రీడాధికారి ఎం.హరనాథ్, సహాయాధికారి దేవ్ సాహు, ఎన్.ఉష తదితరులు పాల్గొన్నారు.


