● ‘విధి’ వంచితులు
వసూళ్లపైనే దృష్టి... సౌకర్యాలు నాస్తి...
జిల్లా పంచాయతీ కార్యాలయం
నాకు 32 ఏళ్ల సర్వీస్..57 ఏళ్ల వయస్సు. ఇంటి పన్ను వసూళ్లు చేయమని నాకు రోజుకు రూ.10 లక్షల టార్గెట్ ఇచ్చారు. కమిషనర్ గారు నుంచి తీవ్ర ఒత్తిడి ఉందంటూ జిల్లా పంచాయతీ అధికారి గ్రూప్ కాల్స్ చేసి పదే పదే వేధిస్తున్నారు. ఈ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితిలో లేను. ఇలా అయితే నేను ఉద్యోగం చేయలేను. కమిషనర్ నుంచి జిల్లా డీపీఓ వరకూ తీవ్ర ఒత్తిడి పెడుతున్నారు. చోడవరంలో ఏ పంచాయతీ కార్యదర్శి రోజుకు రూ.10 లక్షల టార్గెట్ చేయలేరు. ప్రజలను వేధించి..కొట్టేసి..వారి ఇంటిలో సామాన్లు బయటపడేసి వసూళ్లు చేస్తామా..?
– ఓ పంచాయతీ కార్యదర్శి
ఆవేదన
జి
ల్లాలో చోడవరం, పాయకరావుపేట, సబ్బవరం, పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లి వంటి ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులకు పన్ను వసూళ్లకు భారీ టార్గెట్లు
విధించారు. మేజర్ పంచాయతీల్లో అయితే రోజుకు రూ.10 లక్షల లక్ష్యం పెట్టి మరీ వసూళ్లు చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామాల్లో సాధారణంగా ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ ఆదాయం తగ్గడం, ఉపాధి సమస్యలు వంటి కారణాలతో అనేక కుటుంబాలు సకాలంలో పన్నులు చెల్లించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన గడువు కార్యదర్శులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతోంది.
ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వసూళ్ల లక్ష్యాలను నిర్ణయించే ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం వాస్తవ స్థితిగతులకు భిన్నంగా నివేదికలు తయారు చేస్తున్నారు. గత సంవత్సరపు వసూళ్ల శాతం, పెండింగ్ బకాయిలు, కొత్తగా నమోదైన ఇళ్ల సంఖ్య వంటి అంశాల ఆధారంగా ఈ లక్ష్యాలను నిర్ణయిస్తున్నప్పటికీ గడిచిన ఏడాదిలో కొరతగా ఉన్న సౌకర్యాలను మరుసటి ఏడాదిలో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టలేకపోతున్నారు. చెత్త సేకరణ సక్రమంగా లేకపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు ఇవన్నీ ప్రజలు ప్రస్తావిస్తుండడంతో ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేయడం కార్యదర్శులకు సవాలుగా మారింది. జిల్లా అధికారులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమీక్షలు పెట్టి తక్కువ వసూళ్లు అయిన చోట వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో వంచాయతీ కార్యదర్శులు మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
సాక్షి, అనకాపల్లి: ఈ నెలాఖరు నాటికి శతశాతం ఇంటి పన్నుల వసూలు చేయాల్సిందేనంటూ అధికార యంత్రాంగం విధించిన డెడ్‌లైన్‌తో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనిపై ఇప్పటికే ఓ పంచాయతీ కార్యదర్శి వెలిబుచ్చిన ఆవేదన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రకరకాల సర్వేలు, శానిటేషన్ పనులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, నీటి పన్నులు, లైటింగ్ చార్జీలు, ఇతర గ్రామ పన్నుల వసూళ్లను చేపట్టింది. తొలుత ఈనెల 15వ తేదీ లోపు వసూళ్లను పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. ఈ నెలాఖరు నాటికి గడువు పెంచారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ నోటీసులు జారీ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరికలు చేయడంతో పంచాయతీ కార్యదర్శుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
సగానికి పైగా బకాయిలు...
జిల్లాలో ఉన్న 24 మండలాల్లోను 646 గ్రామ పంచాయతీల్లో 3.90 లక్షల గృహాలు, షాపులు, ఇతర పన్నుల వనరుల ద్వారా మొత్తం రూ.44 కోట్ల పన్నులు ఉన్నాయి. అయితే వీటిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12 కోట్లు ఇంటి పన్ను ఉంది. పాత బకాయిలు రూ.32 కోట్ల వరకు ఉన్నాయి. అన్నింటిని కలిపి ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులు 50 శాతం మేర అంటే దాదాపు రూ.22 కోట్ల వరకు వసూళ్లు పూర్తి చేశారు. అయినప్పటికీ బకాయిగా ఉన్న మిగిలిన రూ.22 కోట్ల కూడా ఒక్క పైసా బకాయి లేకుండా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కార్యదర్శులకు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒత్తిడి విధానం కాకుండా ప్రోత్సాహక విధానం అవలంభించి వసూళ్లు జరిగేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.
పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనన మరణ నమోదులు, పలు రకాల ధ్రువీకరణలు, పథకాల అమలు, గ్రామ సభలు, ఆన్‌లైన్ ఎంట్రీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక వంటి పనులతో పాటు కొన్ని ఆన్‌లైన్ సర్వేలు, ప్రతి రోజు తెల్లవారు 6 గంటల నుంచి పారిశుధ్య పనులతో మొదలు పెట్టి సాయంత్రం వరకు అనేక పనులు కార్యదర్శుల భుజాలపైనే ఉన్నాయి. మరోపక్క యూనిక్ ఫ్యామిలీ సర్వే టార్గెట్ కూడా కొనసాగుతుంది. వీటన్నింటికి తోడు ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యాలు కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలనే ఒత్తిడి పెరగడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల మానసిక ఒత్తిడికి లోనై పలువురు కార్యదర్శులు ఆస్పత్రుల పాలవుతున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు.
ముక్కుపిండి వసూలు చేయాల్సిందే...
ఇంటి పన్నులపై ప్రభుత్వం కఠిన ఆదేశాలు
రోజుకు టార్గెట్ రూ.10 లక్షలు
పంచాయతీ కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి
బకాయిలుంటే సస్పెన్షన్ అంటూ ఉన్నతాధికారుల బెదిరింపులు
జిల్లాలో 646 పంచాయతీల పరిధిలో రూ.44 కోట్ల బకాయిలు


