అనకాపల్లి: పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు కలెక్టర్లు విజయకృష్ణన్, దినేష్ దంపతులు అన్నారు. స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఉగాది పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను కలెక్టర్ దంపతులు గురువారం అందజేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విజయకృష్ణన్ మాట్లాడుతూ అమ్మ వారి సన్నిధిలోనే ఉగాది పండగ కుటుంబ సమేతంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుని, భావితరాల ప్రజలకు వారసత్వంగా అందించాలన్నారు. ఆలయ ఆవరణలో వేదపండితులు రేజేటి అప్పలాచార్యులు పంచాగ శ్రవణం చేసి పరాభవ సంవత్సర నవ నాయకుల సంచారాన్ని బట్టి సంవత్సర కాల ప్రభావాలను అనంతరం 12 రాశుల ఆదాయ, వ్యయాలను తెలిపారు. అనంతరం ఎస్.రాయవరం మండలం కోరుప్రోలు సీతారామ స్వామి దేవాలయం అర్చకులు సుదర్శనం నారాయణాచార్యులు, చీడికాడ మండలం ఖండివరం రామలింగేశ్వర స్వామి దేవాలయం అర్చకులు అయాలూరి భాస్కరరావు, అనకాపల్లి వేల్పులవీధి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సూర్య ప్రకాశరావు, గవరపాలెం నూకాలమ్మ వారి దేవాలయం ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ, నర్సీపట్నం దుర్గ మల్లేశ్వరస్వామి దేవాలయం అర్చకులు పెరి వెంకట నరసింహమూర్తి, యలమంచిలి వేణుగోపాలస్వామి దేవాలయం అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యాలు, అల్లూరి జిల్లాకు చెందిన అర్చకులు తరముల కొండలరావు, చింతపల్లి మండలం సీతారామాలయం అర్చకులు గడుతూరి రాజారావు, కొండావంచుల పాడి మోహన్‌రావులను కలెక్టర్ దంపతులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్ దంపతులు, దేవదాయశాఖ ఉప కమిషనర్ సుజాత, జిల్లా దేవదాయశాఖ అధికారి కవిటపు లక్ష్మీ సుధారాణి, ఆలయ సహాయ కమిషనర్ శ్రీధర్, ఆలయ చైర్మన్ నాగశ్రీను, ఆర్డీవో షేక్ ఆయిషా, మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు.
స్వయంభూ విఘ్నేశుని సన్నిధిలో...
చోడవరం / బుచ్చెయ్యపేట : ఉగాది పర్వదినం పురస్క రించుకుని చోడవరం స్వయంభూ విఘ్నేశుడిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి తిరువీధోత్సవం వైభవంగా జరిగింది. గిరిజాంబ కొండపై కొలువై ఉన్న వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయంలో ీసీతారాముల కల్యాణం వేడుకగా నిర్వహించారు.
వడ్డాది వెంకన్న సన్నిధిలో సీతారాముల కల్యాణం
చోడవరం స్వయంభూ విఘ్నేశుడి దర్శనానికి క్యూలైన్లో భక్తులు


