పీహెచ్‌సీ స్థలంలో మైదానం పనులు ప్రారంభం
● జిల్లాలో 15 మండలాల్లో
మైదానాలకు నిధులు
● 14వ తేదీ కల్లా అందుబాటులోకి..
● జిల్లా క్రీడల అధికారి శైలజ వెల్లడి
నాతవరం: మండల కేంద్రం నాతవరంలోని పీహెచ్‌సీ ప్రాంగణంలో తలపెట్టిన క్రీడా మైదానం పనులు పోలీసు బందోబస్తు నడుమ ప్రారంభమయ్యాయి. వైఎస్సార్‌సీపీ, కూటమి పార్టీల మధ్య వివాదాస్పదంగా మారిన ఈ మైదానం పనులకు బుధవారం జిల్లా క్రీడా శాఖాధికారి శైలజ దగ్గరుండి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాలను ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె చెప్పారు. నాతవరం పీహెచ్‌సీ ప్రాంగణంలోని స్థలంలో మైదానం నిర్మాణానికి కలెక్టరు విజయకృష్ణన్ స్వయంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో మైదానాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా.. కోటవురట్ల మండలంలో మాత్రమే సాంకేతిక సమస్య కారణంగా పనులు ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ రాజ్‌శాఖ జేఈ వెంకటేశ్వరమ్మ, ఆర్‌ఐ నాగరాజు, మండల సర్వేయరు సత్యనారాయణ, నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి అపిరెడ్డి మాణిక్యం, టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ అభివృద్ధికి ఆటంకం
పీహెచ్‌సీ స్థలంలో క్రీడా మైదానం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులు స్వయంగా కలెక్టరుకు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేసినా కనీసం స్పందన లేకుండా పోయింది. ఈ పీహెచ్‌సీ స్థలంలో నిబంధనలు ఉల్లంఘించి కూటమి నేతలు మైదాన నిర్మాణ పనులను గత డిసెంబరు 26న ప్రారంభించారు. ఈ పనులకు పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ ఆమోదం గానీ, పంచాయతీ సర్పంచ్ తీర్మానం గానీ లేకుండా ఏకపక్షంగా పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పనులపై మండల స్థాయి అధికారులతో పాటు డీఎం అండ్ హెచ్‌వోకు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స, వైస్ ఎంపీపీ పైల సునీల్, నాతవరం సర్పంచ్ గొలగాని రాణీ, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు స్వయంగా ఫిర్యాదు చేశారు. గత నెల 29న పీజీఆర్‌ఎస్‌లో కలెక్టరు విజయకృష్ణన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పీహెచ్‌సీ స్థాయి 30 పడకలకు ప్రతిపాదనలు ఉందని, అది మంజూరు అయితే స్థల సమస్య వస్తుందన్నారు. మైదానం నిర్మాణానికి నాతవరంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయినా నిబంధనలు ఉల్లంఘించి కూటమి నేతలు సూచన ప్రకారమే అధికారులు మైదానం పనులకు శ్రీకారం చుట్టారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా క్రీడా అధికారి శైలజ, ఎంపీడీవో శ్రీనివాస్, పలువురు అధికారులు పోలీసు బందోబస్తుతో కూటమి నేతలు ఆధ్వర్యంలో బుధవారం పనులు ప్రారంభించారు. ఈ విషయంపై జిల్లా క్రీడల అధికారి శైలజను వివరణ కోరగా.. కలెక్టరు ఆదేశాలతోనే పీహెచ్‌సీ స్థలంలో మైదానం నిర్మాణం చేపడుతున్నామన్నారు.


