ప్రభుత్వమా కళ్లు తెరిచి చూడు..!
ఫ్యాక్టరీ గేటు వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్న రైతు సంఘాల ప్రతినిధులు
చోడవరం : ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరకు రైతులకు వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కళ్లు మూసుకొని ఉందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన రిలేదీక్ష శిబిరం గురువారం 7వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు, ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీసంఘం, ఏపీ రైతు సంఘం, ఈ శిబిరంలో పాల్గొని నిరసన తెలిపారు. చెరకు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు. తమను గెలిపిస్తే ఫ్యాక్టరీని ఆదునీకరించి, చెరకు రైతులకు టన్నుకి రూ. 4వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులు, రైతు కూలీల, కార్మికులను కూటమి ప్రజాప్రతినిధులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని, కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా అధ్యక్షుడు వి. శ్రీనువాసరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, ఏడువాక శ్రీను, సుగర్ ప్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు కోన మోహన్‌రావు, సిఐటియూ నాయకుడు ఎస్.వి.నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్.దేముడునాయుడు, వనం సూర్యనారాయణ, పోతల శ్రీరాముల పాల్గొన్నారు.


