గజవాహనంపై వెంకన్న తిరువీధి సేవలు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. ముందుగా గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. కొండదిగువన వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారికి నిత్యార్చనలు,విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం పూజలు నిర్వహించారు. తదుపరి శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు.అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 24వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. అర్చక స్వాములు ప్రసాదాచార్యులకు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు సాయి ఆచార్యులు పాల్గొన్నారు. తిరువీధి సేవలకు ముందు వైకుంఠనాథుడిగా స్వామివారు శేషపాన్పుపై శయనిస్తున్నట్టు అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.


