ఆగి ఉన్న నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ
● లారీ క్యాబిన్‌లో చిక్కుకుని డ్రైవర్ మృతి
● మృతుడు నల్లగొండ జిల్లా వాసి
యలమంచిలి రూరల్: హైవే డివైడర్‌లో మొక్కలకు నీరు పోయడానికి నిలిపి ఉంచిన ట్యాంకర్ లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. యలమంచిలి మండలం పులపర్తి సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైవే డివైడర్‌లో పెంచుతున్న మొక్కలకు నీరు పోస్తూ హైవే నిర్వహణ సంస్థకు చెందిన ట్యాంకర్ లారీ నెమ్మదిగా వెళుతోంది. ఆ సమయంలో అనకాపల్లి నుంచి తుని వైపు ప్రయాణిస్తున్న టీఎస్ యూఎఫ్6579 నంబరు గల లారీ వేగంగా వెళ్లి ట్యాంకర్‌ను ఢీకొంది. హెచ్చరిక కోసం పెట్టిన సూచికల బోర్డులను సైతం ఢీకొడుతూ వెళ్లి ట్యాంకర్‌ను ఢీకొనడంతో లారీ ముందు భాగం నుజ్జయింది. దీంతో లారీని నడుపుతున్న డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. శరీరంలో నడుము కింద భాగాలన్నీ ముద్దయి తీవ్ర రక్తస్రావంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. లారీ క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు హైవే నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు సుమారు మూడు గంటలు శ్రమించినా ఫలితం లేకపోయింది. మృతి చెందిన లారీ డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తస్కనిగూడెం కు చెందిన హెచ్.వెంకటయ్య(51) గా గుర్తించారు. ట్యాంకర్ రోడ్డుపై తిరగబడగా, ఢీకొట్టిన లారీ రోడ్డు పక్కగా ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చివరకు క్రేన్ సాయంతో పాటు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందజేశారు. దీనిపై మృతుని కుటుంబీకులు వచ్చిన తర్వాత వారి వద్ద నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
ఆగి ఉన్న నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ
ఆగి ఉన్న నీళ్ల ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ


