విశాఖలో లైట్‌ హౌస్‌ మ్యూజియం | - | Sakshi
Sakshi News home page

విశాఖలో లైట్‌ హౌస్‌ మ్యూజియం

Jan 11 2026 7:31 AM | Updated on Jan 11 2026 7:31 AM

విశాఖలో లైట్‌ హౌస్‌ మ్యూజియం

విశాఖలో లైట్‌ హౌస్‌ మ్యూజియం

● కేంద్ర మంత్రి సోనోవాల్‌ ప్రకటన ● ఘనంగా ముగిసిన 3వ ఇండియన్‌ లైట్‌ హౌస్‌ ఫెస్టివల్‌

ఏయూక్యాంపస్‌: దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న క్రమంలో మన మూలాలను, చరిత్రను విస్మరించకూడదని ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ పిలుపునిచ్చారు. ఎంజీఎం పార్క్‌ వేదికగా 3వ ఇండియన్‌ లైట్‌ హౌస్‌ ఫెస్టివల్‌ ముగింపు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోనోవాల్‌ ప్రసంగిస్తూ... మారిటైం సంస్కృతి, చరిత్రలకు లైట్‌ హౌస్‌లు సాక్ష్యాలుగా నిలుస్తాయని అభివర్ణించారు. పర్యాటక రంగాన్ని మారిటైం మౌలిక వసతులతో, మన సంస్కృతితో అనుసంధానించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 5 వేల సంవత్సరాల కిందటే భారత్‌ సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలోని అత్యుత్తమ 20 కంటైనర్‌ పోర్టుల్లో విశాఖ పోర్ట్‌ ఒకటిగా నిలిచిందన్నారు. విశాఖ నగరంలో లైట్‌ హౌస్‌ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇక్కడి ఇండియన్‌ మారిటైం వర్సిటీలో ఇండియా షిప్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 లైట్‌ హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దామని, అదనంగా మరో 25 లైట్‌ హౌస్‌లను అభివృద్ధి చేస్తామని, ఇందులో ఏపీకి చెందినవి కూడా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సోనోవాల్‌ తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘తెలుగు చాలా తీయనైన, అందమైన భాష. ఇది వినడం నాకెంతో ఇష్టం’అంటూ.. మీరంతా బాగున్నారా? అని తెలుగులో పలకరించి సభికులను ఆకట్టుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్‌ గోపి మాట్లాడుతూ.. లైట్‌ హౌస్‌లు కేవలం కట్టడాలు కావని, అవి ఒక నమ్మకానికి ప్రతిరూపాలని అన్నారు. ప్రాచీన వాణిజ్యం, తీరప్రాంత ప్రజల అనుబంధానికి, దేశ సార్వభౌమాధికారానికి ఇవి చిహ్నాలుగా నిలుస్తాయని చెప్పారు. హెరిటేజ్‌ టూరిజంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను మంత్రి సోనోవాల్‌ వర్చువల్‌గా ఆవిష్కరించారు. విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ లైట్‌ హౌస్‌ అండ్‌ లైట్‌ షిప్స్‌ మధ్య ఒప్పంద పత్రాలను మంత్రుల సమక్షంలో మార్చుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర ఓడరేవుల శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌, అదనపు కార్యదర్శి ముఖేష్‌ మంగల్‌, లైట్‌హౌస్‌ అండ్‌ లైట్‌ షిప్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ మురుగానందం, విశాఖ పోర్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోష్ని కోరాటి, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ కెప్టెన్‌ దివాకర్‌, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement