పట్టాదారుకు తిప్పలు | - | Sakshi
Sakshi News home page

పట్టాదారుకు తిప్పలు

Jan 11 2026 7:31 AM | Updated on Jan 11 2026 7:31 AM

పట్టాదారుకు తిప్పలు

పట్టాదారుకు తిప్పలు

తప్పుల తడకగా పాసు పుస్తకాలు

డేటా అప్‌డేట్‌ కాకపోవడంతో గందరగోళం

క్రయ, విక్రయాలు నమోదు కాక అవస్థలు

373 గ్రామాల్లో రీ సర్వేలో 2,01,841 పుస్తకాలు సిద్ధం

తప్పుల కుప్పలు

సాక్షి, అనకాపల్లి:

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తోంది. ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్‌ పుస్తకాలు నిండా తప్పులే దర్శనమిస్తున్నాయి. పేర్లు, సర్వే నంబర్లు తారుమారయ్యాయి. వయసు, భూమి వివరాల్లోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ డేటా అప్‌డేట్‌ కాకపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. తాజా క్రయ, విక్రయాలు (రిజిస్ట్రేషన్లు) ఈ పుస్తకాల్లో నమోదు కాకపోవడంతో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. భూముల అమ్మకాలు జరిగినా, కొత్త యజమానుల పేర్లు పాస్‌ పుస్తకాల్లో మారలేదని పలువురు వాపోతున్నారు. తప్పులు ఉన్న విషయం తెలియక అనేక మంది వాటిని తీసుకున్న తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రింటింగ్‌ కూడా సరిగా లేదు. చిరునామాలు, పేర్లలో అక్షర దోషాలు, వయసులో తేడాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పేర్లు కూడా మారిపోయాయి.

ఇంకా పూర్తి కాని పంపిణీ

భూ యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీకి ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టింది. కలెక్టర్‌, జేసీ పర్యవేక్షణలో తహసీల్దార్లు ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 373 గ్రామాల్లో రీ–సర్వే పూర్తి కాగా, సుమారు 2,01,841 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ సభల ద్వారా రైతులకు నేరుగా అందజేయాలని నిర్ణయించారు. అయితే పంపిణీ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. పుస్తకాల్లో కోకొల్లలుగా తప్పులు ఉండడంతో వాటిని తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు

జాప్యంపై అసహనం

సాధారణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 45 పని దినాల్లోగా పాసు పుస్తకాలు మంజూరు చేయాల్సి ఉంది. భూ యజమానులకు పాస్తుపుకాలు చేరడానికి 100 రోజులకు పైగా పడుతోంది. దరఖాస్తు చేసిన ఏడాది తర్వాత కూడా పుస్తకాలు అందక అనేక మంది అవస్థలు పడుతున్నారు. జిల్లాలో రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈకేవైసీ చేయించుకుని రైతులకు పాసుపుస్తకాలు అందజేస్తున్నారు. తరచూ సర్వర్‌ మొరాయిస్తుండడం వల్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులు చాలా సార్లు అధికారుల చుట్టూ తిరాగాల్సి వస్తోంది.

చక్కదిద్దే పనిలో రెవెన్యూ యంత్రాంగం

రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో సిద్ధం చేసిన పుస్తకాలు తప్పుల తడకగా రావడంతో, వాటిని చక్కదిద్దే పనిలో రెవెన్యూ యంత్రాంగం ఉంది. భూముల విస్తీర్ణంలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు సరిచేయాలంటూ కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అధికారులు వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు. క్రయవిక్రయాలు, భాగస్వామ్య పంపిణీ, గిఫ్ట్‌ డీడ్‌లు, మ్యుటేషన్లు వంటివి పూర్తయిన తరువాతే పట్టాదారు పాస్‌ పుస్తకాలు కోసం ధరఖాస్తు చేసుకోవాలని అప్పుడే మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

జెట్టపురెడ్డితునిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నిర్వహించి, పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేపట్టారు. అయితే రీసర్వేలో తప్పులు చోటు చేసుకున్నాయని, మళ్లీ సర్వే జరిపించి సవరణ చేసి అందజేయనున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అడపాదడపా ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో మొక్కుబడిగా సర్వే జరిపించి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సర్వే చేసిన నివేదిక ఆధారంగా ఇచ్చిన పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త పుస్తకాల పంపిణీ చేపట్టింది. అవి కూడా తప్పుల తడకగా మారాయి.దీనివల్ల భవిష్యత్‌లో రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందడానికి, రిజిస్ట్రేషన్‌ సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తప్పులను సరిచేసిన తర్వాత పాసు పుస్తకాల పంపిణీ చేపట్టాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement