వివాహిత ఆత్మహత్య
అనారోగ్య కారణాలతో బలవన్మరణం
యలమంచిలి రూరల్: రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ సహా పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వివాహిత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యలమంచిలి మునిపాలిటీ కోర్టు వీధిలో శనివారం చోటుచేసుకుంది. అప్పటివరకు తమతో మాట్లాడి నిద్రపోయిన ఆమె మానసిక వేదనతో బలవన్మరణానికి పాల్పడడంతో పండగ ముందు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. యలమంచిలి పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి కథనం ప్రకారం పట్టణంలో కోర్టు వీధిలో మేడిశెట్టి శ్రీనాథ్ శ్రీనివాసరావు భార్య రాధిక(40)తో కలిసి నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.పెద్ద కుమార్తె నూజివీడు ట్రిపుల్ ఐటీలో, చిన్న కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. శ్రీనివాసరావు ఇదే మున్సిపాలిటీ పరిధి పెదపల్లి సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.గత కొన్నేళ్లుగా రాధిక అనారోగ్యంతో బాధపడడంతో వైద్యానికి బాగా ఖర్చవుతోంది. ఒక చేయి పనిచేయకపోవడంతో ఇంట్లో పనులు కూడా చేయలేని స్థితి ఉంటోంది. కుటుంబంపై ఆర్థిక భారం పడడంతో ఆమె మానసికంగా కుంగిపోయారు. శుక్రవారం రాత్రి పెద్ద కుమార్తెను సంక్రాంతి పండగ కోసమని నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి తండ్రి శ్రీనివాసరావు తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికొచ్చిన పెద్ద కుమార్తెతో మాట్లాడిన రాధిక అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటి బయట గడియ పెట్టి మేడపైకి వెళ్లి ఐదు బాటిళ్లతో ఉన్న పెట్రోల్ తన శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, అందరూ నిద్రపోతున్న సమయం కావడంతో రాధిక ఆత్మహత్య చేసుకున్న విషయం ఎవరూ గుర్తించలేదు. పక్కింట్లో వ్యక్తి మేడపై పొగ వస్తుండడాన్ని గమనించి చలిమంట వేసుకున్నారని తొలుత భావించారు. ఉదయం ఆరు గంటల సమయంలో మేడపై ఎవరో చనిపోయి ఉండడాన్ని వాకలి తుడుస్తున్న వృద్ధురాలు గమనించి రాధిక కుటుంబసభ్యులకు చెప్పగా ఇంట్లో రాధిక లేరని గుర్తించారు. భర్త శ్రీనివాసరావు మేడపైకి వెళ్లి పరిశీలించగా రాధిక శరీరమంతా కాలిపోయి గుర్తుపట్టలేనట్టుగా ఉంది. అయితే పక్కనున్న స్వెట్టర్, ఇతర ఆనవాళ్లు చూసి ఆత్మహత్య చేసుకున్నది తన భార్య రాధికగా ఆయన నిర్థారించుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి ఘటనా స్థలానికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడిన రాధిక మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి, ఇతర కుటుంబసభ్యులను కూడా పోలీసులు విచారించారు. తమ కుమార్తె మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని, అనారోగ్యం కారణంగా బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తామంతా భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం రాధిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు.


