ప్రోత్సహిస్తే ఆదాయార్జనే..!
పోషక పంటలపై
ఉమ్మడి విశాఖ రైతుల ఆసక్తి
మార్కెట్ డిమాండ్, ఆదాయార్జనే
లక్ష్యంగా వినూత్న ప్రయోగాలు
నగర రైతుబజార్లలో విరివిగా
బ్రొకలి, లెట్యూస్, మస్రూమ్
బయట మార్కెట్‌తో పోలిస్తే
అతి తక్కువ ధరలకే లభ్యం
ప్రోత్సహిస్తే అద్భుతాలు
చేస్తామంటున్నా రైతులు
ఎంవీపీకాలనీ(విశాఖ) : సీజనల్ పంటలతో కనీస ఆదాయం లభించక రైతులు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. టమాట, ఉల్లి, బంగాళాదంపలు, వంగ, మిరప వంటి సాధారణ పంటల ధరలు ఏటా సీజనల్‌గా పతనం కావడం వారిని ఆర్థికంగా కుంగదీస్తోంది. ఆయా పంటలను పండించేందుకు భారీగా పెట్టుబడులు పెడుతునప్పటికీ ధరల పతనం నష్టాలను తెచ్చుపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్న కొందరు రైతులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సాధారణ పంటలను పక్కనబెట్టి మార్కెట్ డిమాండ్‌తో పాటు ఆదాయాన్ని తెచ్చేపెట్టే పోషక పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. నగర వాసులకు పోషక ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూనే లాభాలను ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భారీ విస్తీర్ణంలో పంటల ఉత్పత్తి చేపట్టి మరిన్ని అద్భుతాలు సాధిస్తామంటున్నారు.
ప్రోత్సహిస్తే మరింత దిగుబడి
మాది పెందుర్తి మండలం పెదగాడి. గత కొన్నేళ్లుగా అక్కయ్యపాలెం రైతు బజార్‌లో ఆర్గానిక్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు) విక్రయిస్తున్నాను. ఇతర పంటల కంటే ఈ పంట విధానం భిన్నంగా ఉంటుంది. మార్కెట్‌లో మంచి డిమాండ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం ఉండటంతో మంచి ఆదాయం కూడా లభిస్తోంది. ప్రస్తుతం 220 గజాల విస్తీర్ణంలో మష్రూమ్స్ పండిస్తున్నాం. తొలుత వరిగడ్డిని నానబెట్టి తరువాత స్పాన్ (పుట్టగొడుగుల విత్తనాలు) కలిపి సంచుల్లో నింపి చీకటి ప్రదేశంలో ఉంచాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 22 నుంచి 25 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. సరైన తేమ, గాలి ప్రసరణ ఉండాలి. ఇలా 25 రోజులు నిల్వచేసిన అనంతరం పంట లభిస్తుంది. అయితే ఈ విధానం ద్వారా ప్రస్తుతం మేము వారానికి 40 కేజీల మష్రూమ్స్ దిగుబడి తీస్తున్నాం. ఒక సీజన్‌లో 750 కేజీల వరకు దిగుబడి వస్తోంది. ప్రస్తుతం రైతు బజార్‌లో కేజీ మష్రూమ్స్ రూ.400లకు విక్రయిస్తుండగా బయట మార్కెట్‌లో దీని ధర కేజీ రూ.600 పైనే పలుకుతోంది. అయితే పంట సమయంలో ప్రభుత్వం రుణ సహాయంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే మరింత దిగుబడి సాధించే దిశగా అడుగులు వేస్తాం.
– ముసల్ల నాయుడు, రైతు పెదగాడి


