భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలి
ఆరిలోవ(విశాఖ): పోలీసుల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. విశాఖ నగరంలోని విశాలాక్షినగర్‌లో కై లాసగిరి వద్ద ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పోలీస్ ఆయుధాగారంలో నిల్వ ఉన్న రక్షణ పరికరాలు, వాటి నాణ్యత, రిజిస్టర్లు, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, వాటి పనితీరు, వాటి ఫిట్‌నెస్, డాగ్ స్క్వాడ్, వీఐపీ సెక్యూరిటీ తదితర వాటిని పరిశీలించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాణ్యమైన రక్షణ పరికరాల వల్ల పోలీస్ సిబ్బందికి మంచి రక్షణ ఉంటుందన్నారు. వాటిని ఉపయోగించడంలో సిబ్బందికి మెలకువలు అవసరమని, రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్లు బి.రామకృష్ణారావు, ఎల్.మన్మధరావు, బి.రమణమూర్తి, ఎం.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


