అవయవదానంపై అవగాహన పెరగాలి
అఖిల భారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ
శరీర,అవయదానం చేసిన చోడవరానికి చెందిన దంపతులు
చోడవరం : మనిషి మరణించిన తర్వాత కూడా జీవించి ఉండాలంటే ప్రతి ఇక్కరూ శరీర అవయవ దానం చేయాలని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ అన్నారు. స్థానిక ఉషోదయ విద్యాసంస్థల ఆవరణలో విశ్వనాథం టైప్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శరీర అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చనిపోయిన తర్వాత శరీరాన్ని మట్టిలో బూడిదగా కలిపేయకుండా శరీర అవయవాలను దానం చేయడం ద్వారా మరి కొంత కాలం ఆ మనిషి పరోక్షంగా బతికేటట్టు ఆలోచన చేయాలన్నారు. అవయవ సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారికి చనిపోయిన వారి శరీర అవయవ దానం చేయడం ద్వారా వారికి ప్రాణదానం చేసిన వారవుతారన్నారు. పుట్టిన వాడు ఎప్పుడైనా చనిపోక తప్పదని అదే వారు శరీర అవయవదానం చేస్తే మరికొంత కాలం జీవించి ఉన్నట్టేనని అన్నారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టు అవుతుందన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మరియాల కృష్ణారావు, నిర్వాహకుడు పసుమర్తి బాబ్జి, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ, గవర్నమెంటు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్‌కుమార్, జి. గోవిందనాయుడుపాల్గొన్నారు.
శరీర, అవయవదానం చేసిన దంపతులు
తమ శరీర అవయవదానంతో కొందరికి ప్రాణదానం చేయాలన్న ఆశయంతో తమ శరీరాలను దానం చేస్తున్నామని చోడవరానికి చెందిన వృద్ధ దంపతులు పసుమర్తి సత్యనారాయణ, అన్నపూర్ణమ్మ చెప్పారు. చోడవరంలో జరిగిన అవయదానం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ సందర్భంగా తమ శరీర, అవయవాలను దానం ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పత్రాలను అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీకి అందజేశారు. ఈ దంపతుల ఔదార్యానికి అంతా అభినందించారు.


