కేటుగాళ్లకు పండగ! | - | Sakshi
Sakshi News home page

కేటుగాళ్లకు పండగ!

Jan 9 2026 7:43 AM | Updated on Jan 9 2026 7:43 AM

కేటుగ

కేటుగాళ్లకు పండగ!

●ఆదమరిచారో జాగ్రత్త...

సాక్షి, అనకాపల్లి : దృష్టి మరల్చి దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలు జిల్లాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే హరియాణా, యూపీకి చెందిన ‘అటెన్షన్‌ డైవర్షన్‌’ నేరస్తులు దొంగతనాలకు, చోరీలకు, దోపిడీలకు పాల్పడతారు. రెప్పపాటు సమయంలోనే మన దృష్టిని మరల్చి సొత్తు మాయం చేస్తారు. ఇలా వచ్చి..అలా కొట్టేసి ఏమి తెలియకుండానే దూరంగా మాయమవుతారంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంక్రాంతి పండగ నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, వస్త్ర దుకాణాల వద్ద, ట్రాఫిక్‌ కూడళ్లు. నిర్మానుష్య ప్రదేశాలు, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్ద వ్యక్తులను ఈ ముఠాలు టార్గెట్‌ చేసుకుంటారు. జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతంలో దృష్టి మరల్చి చేసే నేరాలకు అడ్డాగా ఎంచుకుంటారు. నగదు విత్‌ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్లకు వచ్చే వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులను బురిడీ కొట్టిస్తారు. బంగారం, సెల్‌ఫోన్‌ దుకాణాల వద్ద చేరతారు. దుకాణ నిర్వాహకులు ఏమరుపాటుగా ఉన్న సమయంలో వస్తువులు కొట్టేస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సంక్రాంతి. పండగ సెలవుల్లో సొంత ఊర్లకు వెళ్లే వారు తమ విలువైన సొత్తు, నివాసాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉంచుకోవాలంటూ అప్రమత్తం చేస్తున్నారు.

‘పాపిలోన్‌’ స్కానర్‌తో తనిఖీలు..

జాతీయ రహదారికి ఆనుకుని వున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగటిపూట దొంగతనాలు చేసే పగటి దొంగలూ ఉన్నారు. రాత్రిపూట ఇంట్లో చొరబడి దోపిడీలకు పాల్పడే రేచుక్కలూ ఉన్నారు. ఇలా నేరాలకు పాల్పడి తప్పించుకునే అనుమానితులు, నిందితులను ‘పాపిలోన్‌’ స్కానర్‌ టెక్నాలజీతో, ఏఎన్‌పీఆర్‌ సీసీ కెమెరాలతో పోలీసులు పట్టేస్తున్నారు. నేర పరిశోధనలో పోలీసులకు టెక్నాలజీ తోడైతే..ఎంతటి దొంగైనా పట్టుబడాల్సిందే. నిందితుల వేలిముద్రలను ఆధారంగా ఏళ్ల క్రితం చోరీ చేసి తప్పించుకున్న దొంగను కూడా ఇట్టే పట్టేస్తారు. ఈ నేపథ్యంలో ‘అటెన్షన్‌ డైవర్షన్‌’ పాత నేరస్తులను పట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని కూడళ్లలో పోలీసులు తనిఖీలను విస్తృతం చేస్తున్నారు.

ఊరెళుతున్నారా..ఇల్లు జాగ్రత్త!

నేరాల నియంత్రణ, దొంగతనాల అరికట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు జన సందోహం ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఊర్లకు వెళ్లే వారు తమ ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు ఇతర విలువైన సామగ్రిని ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. పండుగకు ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందించి ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఎల్‌హెచ్‌ఎస్‌(లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం) ఏర్పాటు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. రాత్రి గస్తీ పెట్రోలింగ్‌ ముమ్మరం చేసేందుకు వీలవుతుంది..ఇంటిలో చోరీలు జరగకుండా అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఇళ్లనే దొంగలు ఎంచుకుంటన్నారు.

జిల్లాలో ’అటెన్షన్‌ డైవర్షన్‌’ ముఠాలు..

ప్రస్తుతం జిల్లాలో ప్రజల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే తిరుగుతున్నట్లు నిఘా సమాచారం వచ్చింది. పండగ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాలు, బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద వినియోగదారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారపు సంతలు, బ్యాంకులు, గ్రామ ఉత్సవాల వద్ద రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఈ ముఠాలు తిరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, పానీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. బ్యాంకుల వద్ద లేదా రద్దీ ప్రదేశాల్లో ఎవరైనా మీ దుస్తులపై మురికి పడిందని చెప్పినా, డబ్బులు కింద పడ్డాయని చెప్పినా అప్రమత్తంగా ఉండాలి.‘ప్రజల రక్షణకే మా ప్రాధాన్యత. పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుంది. అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే డయల్‌ 100/ డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలి.

– తుహిన్‌ సిన్హా, ఎస్పీ, అనకాపల్లి జిల్లా

సంక్రాంతి వేళ ’అటెన్షన్‌ డైవర్షన్‌’ ముఠాలు

రద్దీ ప్రాంతాల్లోనే ఈ ముఠాలు టార్గెట్‌

వస్త్ర దుకాణాలు, బ్యాంకులు, గ్రామ ఉత్సవాల్లో చేతివాటం

అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచనలు

గతేడాది వివరాలు ఇలా..

జిల్లాలో 3,573 సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేశారు

గతేడాదిలో సాంకేతికత సహాయంతో 41 కేసులు, వేలిముద్రలు (ఏఎఫ్‌ఐఎస్‌) ద్వారా 58 కేసులను పోలీసులు ఛేదించారు.

కేటుగాళ్లకు పండగ! 1
1/3

కేటుగాళ్లకు పండగ!

కేటుగాళ్లకు పండగ! 2
2/3

కేటుగాళ్లకు పండగ!

కేటుగాళ్లకు పండగ! 3
3/3

కేటుగాళ్లకు పండగ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement