వివేకానందుడే ఆదర్శం
తుమ్మపాల : వివేకానందుడు అందరికీ స్ఫూర్తిదాయకుడని, ఆయన్ను స్పూర్తిగా తీసుకుని వివేకం, విజ్ఞానం, నిరంతర శ్రమతో విజయానికి బాటలు వేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు విద్యార్థులకు సూచన చేశారు. ఈ నెల 12న నిర్వహించనున్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జాతీయ యువజన ఉత్సవాన్ని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన స్వామి వివేకానంద చిత్రపటం వద్ద నివాళులర్పించి వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. రాష్ట్ర స్థాయి హై జంప్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బి.జననిని శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం అందించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువజన సర్వీసులు శాఖ ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఎం.రమ్య మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండాలని, సమాజ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి ఎం.వినోద్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదంండ్రులు,సెట్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.


