రెవెన్యూ క్లినిక్ అర్జీలపై తక్షణ విచారణ
● సమీక్షలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశం
తుమ్మపాల: రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, పౌర సరఫరాలపై మండల, డివిజన్ల వారీగా ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సేవల్లో సమయపాలన, పారదర్శకత ఉండాలన్నారు. రీసర్వే, పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత స్థాయిలో మానిటరింగ్ చేసి, జాప్యంగా చేయకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు. ఆన్‌లైన్ సేవలు, భూ మ్యాపింగ్, రికార్డులు అప్‌డేట్, మ్యుటేషన్ దరఖాస్తులు వంటి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని పరిష్కరించాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో 24 మండలాలు, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి మున్సిపాలిటీలలో జల వనరులను గుర్తించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


