పంచాయతీ అధికారుల అత్యుత్సాహం
తుమ్మపాల: పదేళ్ల క్రితం రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచిన అధికారులే నేడు కలెక్టర్ కారుకు అడ్డుగా ఉన్నాయని పచ్చని చెట్లను కూల్చేశారు. మండలంలో రేబాక–గోపాలపురం రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలతో రోడ్డు ఇరుకుగా తయారైందని పంచాయతీ అధికారులు దుకాణాలను వెనక్కి జరిపించారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా తొలగించేయడంతో అటుగా రాకపోకలు చేస్తున్న ప్రయాణికులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మండలంలో కోడూరు పంచాయతీ పరిధిలో ఎంఎస్‌ఎంఈ పార్క్ వద్ద ఉన్న కలెక్టర్ బంగ్లా నుంచి శంకరంలోని కలెక్టరేట్‌కు రేబాక –గోపాలపురం రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు చేస్తున్నారు. అసలే ఇరుగ్గా ఉండే ఈ రహదారి ఆయా గ్రామాల ప్రజల రాకపోకలతో మరింత రద్దీగా ఉంటుంది. కలెక్టర్ కారుకు దారి ఇవ్వలేదంటూ ఆరు నెలల క్రితం పలు వాహనాలపై కేసులు నమోదు, ట్రాక్టర్లను సీజ్ చేయడం, రేబాకలోని మద్యం దుకాణం వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ కారు కూతకు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల ఓ చిరు దుకాణం వద్ద కలెక్టర్ కారుకు మరో వాహనం అడ్డంగా ఉండడంతో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులను ఆమె హెచ్చరించారు. అందుకే పంచాయతీ అధికారుల ఆగమేఘాల మీద ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలతో పాటు చెట్లను కూడా తొలగించేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
కలెక్టర్ కారు రాకపోకల కోసం చెట్ల తొలగింపు


