ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాలపై అక్రమ కేసులా?
● ప్రభుత్వ నిర్బంధకాండపై రేపు నిరసన
● ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అడిగితే రౌడీషీట్‌లు తెరిచి, అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్ ఆరోపించారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద కూటమి ప్రభుత్వ నిర్బంధ కాండను వ్యతిరేకించడంటూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాల పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకుండా మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పండాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు రాజకీయ నేతల గృహాల్లో ఉన్న ఆస్తులను అడగడం లేదన్నారు. రానున్న రోజుల్లో ఓటు ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాజ్జి, జిల్లా నాయకుడు త్రినాథ్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రాజా, యూత్ లీడర్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


