ఘనమైన కీర్తి.... గత చరిత్రే!
నర్సీపట్నం : గతమెంతో..ఘనమైన నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ వైభవం కోల్పోతుంది. కాలనుక్రమంలో చోటు చేసుకుంటున్న మార్పులతో డివిజన్ మరింత కుదించుకుపోతుంది. నూరేళ్ల చరిత్ర కలిగిన ఈ డివిజన్ ముక్కలు, ముక్కలు అవుతుంది. బ్రిటిష్ కాలంలో డివిజన్ పురుడు పోసుకుంది. నాటి కాలంలో ఇక్కడ రెవెన్యూ డివిజన్‌తో పాటు బ్రిటిష్ అధికారులు అటవీ, రహదారులు, భవనాలు, పోలీసు, వైద్యశాఖల డివిజన్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్రం అనంతరం పంచాయతీరాజ్, తునికలు కొలతలు, విద్యుత్‌శాఖ డివిజన్లు ఏర్పడ్డాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కారణంగా ఈ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.
1923లో డివిజన్ ఏర్పాటు...
నర్సీపట్నం కేంద్రంగా 1923లో ఈ డివిజన్ ఏర్పాటైంది. ఈ డివిజన్ కోసం పాల్‌ఘాట్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డును అనుకుని సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆనాడే సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్మించారు. అప్పట్లో ఎందరో ఆంగ్లేయులు సబ్ కలెక్టర్లుగా పని చేశారు. వారిలో స్కాట్ అనే బ్రిటిష్ అధికారి పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించేది. పరిధిలో పూర్వపు నర్సీపట్నం, యలమంచిలి, నక్కపల్లి, మాడుగుల తదితర తాలుకాలు ఉండేవి. 1987లో మండల వ్యవస్థ వచ్చింది. మండల వ్యవస్థ తరువాత నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాలు ఈ డివిజన్‌లో ఉండేవి. ఉమ్మడి జిల్లాలో విశాఖపట్నం తరువాత నర్సీపట్నం ప్రాధాన్యత డివిజన్‌గా ఉండేది. ఇటు ఏజెన్సీ సరిహద్దు నుంచి అటు సముద్రతీరం వరకు అతిపెద్ద డివిజన్‌గా ఉండేది. నర్సీపట్నంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో పాలనా కార్యక్రమాలు బ్రిటిష్ పాలనలో ఇక్కడ నుంచే జరిగేవి.
పునర్‌వ్యవస్థీకరణతో కుచించుకుపోయి...
దశాబ్దంన్నర క్రితం ఏర్పడిన అనకాపల్లి డివిజన్‌తో ఈ డివిజన్ కొంత కుదించుకుపోయింది. యలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి అనకాపల్లి డివిజన్‌లోకి వెళ్లిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణతో నర్సీపట్నం డివిజన్ పరిధి మరింత తగ్గిపోయింది. నూతన సంవత్సరం నుంచి అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ జెండా ఊపింది. దీంతో ఇప్పటి వరకు నర్సీపట్నం డివిజన్‌లో ఉన్న పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలు అడ్డురోడ్డు డివిజన్‌లోకి వెళ్లనున్నాయి. చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో కలుపుతూ మార్పు చేశారు. దీంతో నర్సీపట్నం విడిజన్ పరిధి ఏడు మండలాలకే పరిమితమైంది. కాలక్రమంలో మార్పులు సహజమైనప్పటికీ, ప్రాధాన్యం కోల్పోవడం స్థానికులకు కొంత ఆవేదన కలిగిస్తోంది. గణమైన కీర్తి..గతచరిత్రగానే మిగిలిపోనుంది.
ఉన్నత స్థాయికి సోపానం..
ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పని చేసిన వారులో కాకి మాధవరావు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు.ఎ.శాంతి కుమారి తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. కాశీపాండ్యన్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు. నిమ్మగెడ్డ రమేష్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు.
బ్రిటిష్ కాలంలో ఏర్పడిన
నర్సీపట్నం డివిజన్
కాలక్రమంలో తగ్గిన ప్రాభవం
అడ్డురోడ్డు డివిజన్ ఏర్పాటుతో
7 మండలాలకే పరిమితం


