తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి.!
సినీఫక్కీలో చోరీ మహిళను బంధించి ఆభరణాలు దోచుకెళ్లిన ముఠా తల్లీకూతుళ్లు సహా నలుగురు అరెస్ట్ 10 తులాల బంగారం, రూ. 10 వేలు స్వాధీనం
అల్లిపురం: ఇంటి యజమానురాలిని తాళ్లతో కట్టేసి.. 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి వస్తువులను దోచుకుపోయిన కేసులో తల్లీకూతుళ్లు సహా మొత్తం నలుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె.లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఈ నెల 14వ తేదీ రాత్రి 9.50 గంటల సమయంలో ధారపాలెం, బంగారుతల్లి లే–అవుట్‌లో నివసిస్తున్న మొండు వసంత తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె లోపల గడియ పెట్టుకుని పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో కాళ్ల వద్ద ఎవరో సంచరిస్తున్నట్లు అలికిడి అయింది. వెంటనే ఆమె లేచేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. ఆమె అరవకుండా నోటిని అక్కడే ఉన్న లంగాతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారు పలక సరలు, నెమలి బిల్ల గల రెండు పేటల గొలుసు, చేతులకు ఉన్న 4 తులాల బంగారు గాజులు, లాకెట్‌తో కూడిన మరో గొలుసు, తులం బరువుగల రెండు ఉంగరాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం నిందితులు బయటకు వెళ్లి, తలుపులకు బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. తర్వాత బాధితురాలు అతికష్టం మీద కట్లు విప్పుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ టవర్ లోకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు వెయ్యి సెల్‌ఫోన్ల డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా రామాయణపురానికి చెందిన నెల్లి నిర్మల కుమారి, ఆమె కుమార్తె నెల్లి లిఖిత, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి (ఇందిరాకాలనీ)కి చెందిన భూపతి అభిరామ్, బి.సావరం గ్రామానికి చెందిన నల్లి మణిరత్నంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
బంధువుల పరిచయంతో..
ప్రధాన నిందితురాలు నెల్లి నిర్మల కుమారి.. ఆరిలోవలోని బంగారుతల్లి లే–అవుట్‌లో నివాసం ఉంటున్న తన పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ ఇంటి యజమానురాలైన వసంత మెడలో ఎక్కువ బంగారు ఆభరణాలు ఉండటం గమనించింది. తనకు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆమెను దోచుకోవాలని పథకం వేసింది. భీమవరం కలెక్టర్ ఆఫీస్‌లో క్యాంటీన్ నడుపుతున్న నిర్మల కుమారి.. తన కుమార్తె లిఖితకు, క్యాంటీన్‌లో పనిచేస్తున్న అభిరామ్, మణిరత్నంలకు డబ్బు ఆశ చూపించి విశాఖ తీసుకువచ్చింది. 13వ తేదీన దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు బాధితురాలికి ‘సెండాఫ్’చెప్పే నెపంతో నిర్మల కుమారి, లిఖిత ఆమెను బయటకు పిలిచారు. ఆ సమయంలోనే అభిరామ్, మణిరత్నం రహస్యంగా ఇంట్లోకి దూరి దాక్కున్నారు. రాత్రి బాధితురాలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయాక, లోపల ఉన్న నిందితులు ఆమెను బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధర్, ఆరిలోవ క్రైం ఎస్‌ఐ ఎ.హరికృష్ణ, ఎంవీపీ క్రైం ఎస్‌ఐ సి.హెచ్.రామదాసు, ద్వారకా క్రైం ఎస్‌ఐ ఎల్. శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు రామారావు, చంద్రశేఖర్‌లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు.
తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి.!


