రోడ్డుపై దొరికిన రూ.47 వేల నగదు
● సొంతదారుకు క్షేమంగా అప్పగింత
● యువకుడి నిజాయితీని అభినందించిన పోలీసులు
యలమంచిలి రూరల్ : మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న పట్టణంలోని శతకంపట్టు ప్రాంతానికి చెందిన యల్లపు సురేష్ తనకు రోడ్డుపై దొరికిన రూ.47వేల నగదు, ఇతర వస్తువులను పోగొట్టుకున్న యువతికి పోలీసుల సమక్షంలో అందజేసి అందరి మన్ననలు పొందారు. అచ్యుతాపురం దిబ్బపాలేనికి చెందిన కూనిశెట్టి రేణుక మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అచ్యుతాపురం గ్రామీణ వికాస బ్యాంకు బ్రాంచి నుంచి రూ.47వేలు డ్రా చేసే పనిపై యలమంచిలి పట్టణానికి వచ్చారు. తిరిగి ఆటోలో వెళ్తుండగా నగదుతో ఉన్న ప్లాస్టిక్ సంచి దిమిలి రోడ్డు పాల అప్పారావు దుకాణానికి సమీపంలో జారిపడింది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న యల్లపు సురేష్ నగదుతో ఉన్న సంచిని చూడగా అందులో నగదుతో పాటు యువతి ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం ఉన్నాయి. వాటిని అటువైపుగా వస్తున్న యలమంచిలి ట్రాఫిక్ ఏఎస్‌ఐ నూకరాజుకు యువకుడు అందజేశాడు. చిరునామా, వివరాల ఆధారంగా దొరికిన నగదు రేణుకకు చెందినదిగా నిర్ధారించుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం ఆ నగదును యలమంచిలి సర్కిల్ కార్యాలయంలో ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి, యల్లపు సురేష్‌ల సమక్షంలో అందజేశారు. యువకుడి నిజాయితీని పోలీసు అధికారులు అభినందించారు.


