వినోదాల వేదిక.. సంక్రాంతి వేడుక
కాలు దువ్వుతున్న పందెం కోళ్లు ఎడ్లు, గుర్రపు పందాలకు సిద్ధం ఖరీదైన ఆహారంతో ప్రత్యేక శిక్షణ
మాడుగుల: తెలుగువారి పండగలలో సంక్రాంతి భిన్నమైనది. పాడి పంట ఇంటికి వచ్చే సమయం కావడంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్దలకు పూజలతోపాటు హరిదాసులు, డూడూ బసవన్నలను ఆదరిస్తారు. రంగ వల్లికలతో శోభ చేకూరుస్తారు. అందులో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడతారు. కనుమ రోజున పశు సంపదకు పూజలు చేస్తారు. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి సందడే సందడి. వీటన్నింటినీ మించిన కొసమెరుపు ఒకటుంది. భోగీ పండగ నుంచి ప్రారంభమయ్యే తీర్థాలు స్వగ్రామాలకు ఇళ్లకు చేరుకునే బస్తీ జనాలకు వినోదాన్ని పంచుతాయి. కోడి పందాలు, ఎడ్లు, గుర్రపు పరుగు పందాలు ప్రత్యేక ఆకర్షణ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాటిని ఆసక్తిగా వీక్షిస్తారు. తీర్థాలలో పంచదార చిలుకలు, రంగుల రాట్నాలు చిన్నారులను అలరిస్తాయి.
నెల రోజుల ముందు నుంచే శిక్షణ
పందెంరాయుళ్లు నెల రోజుల ముందు నుంచే ఎడ్లకు శిక్షణ అందిస్తారు. రేసు గుర్రాలకు, పందెం కోళ్లకు కూడా తర్ఫీదు అందిస్తారు. వీటికి ఖరీదైన ఆహారం అందించడంతోపాటు సకల సదుపాయాలు సమకూరుస్తారు. పండగకు రెండు వారాలకు పైగా సమయం ఉండడంతో ప్రస్తుతం పోటీలకు వాటిని సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. గతంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి గ్రామాల్లో వేకువజాము నుంచే హరిదాసులు పదాలు పాడుతూ సంచరించేవారు. గంగిరెద్దులను ప్రదర్శించేవారు సన్నాయి ఊదుతూ సందడి చేసేవారు. రానురాను ఆ సంప్రదాయాలకు ఆదరణ తగ్గుతోందని వారు వాపోతున్నారు.
వినోదాల వేదిక.. సంక్రాంతి వేడుక
వినోదాల వేదిక.. సంక్రాంతి వేడుక


