హోం మంత్రి కోసమే అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్
యలమంచిలి రూరల్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యయప్రయాసలు తగ్గించేలా అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లో ఉన్న యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను సమీపంలో ఉన్న అనకాపల్లి డివిజన్‌లో కలిపారని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. ప్రజలెవరి నుంచీ ఎలాంటి అ భ్యంతరాలు లేకుండా ప్రక్రియ చేపట్టామని, కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఆదివారం యలమంచిలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నక్కపల్లిలో కాకుండా అడ్డురోడ్డులో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డురోడ్డు మండల కేంద్రం గానీ గ్రామ పంచాయతీ గానీ కాదన్నారు. రైల్వేస్టేషన్, న్యాయస్థానాలు, 200 పరిశ్రమలు యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నాయన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న చోట కాదని కొత్త డివిజన్‌ను అడ్డురోడ్డులో ఏర్పాటు చేయడానికి కారణం హోం మంత్రి అనిత ను సంతృప్తి పరచడం కోసమేనన్నారు.
ప్రజల మనోభావాలకు విలువ లేదా?
యలమంచిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని యలమంచిలి మున్సిపల్ కౌన్సిల్, పలు గ్రామ పంచాయతీల పాలకవర్గాలు తీర్మానాలు చేశాయని, పలు వర్గాల ప్రజలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారని ధర్మశ్రీ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు లేఖ ఇచ్చారని, తీర్మా నం చేశారని అయినా చంద్రబాబు ప్రభుత్వం ప్ర జాభీష్టాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాటకు విలువ లేదని, అనకాపల్లి ఎంపీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియడంలేదన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే..
వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయ మని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యలమంచిలి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ధర్మ శ్రీ చెప్పారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రెపు గుప్తా, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దపు ఎర్రయ్యదొర, అచ్యుతాపురం, రాంబిల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు కోన బుజ్జి, గొట్టుముక్కల శ్రీనుబాబు మాట్లాడారు. రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వర్రావు, పిల్లా త్రినాథరావు, వార్డు కౌన్సిలర్లు గొర్లి వెంకట్, దూది నర్శింహమూర్తి, పిట్టా సత్తిబాబు, రాపేటి సంతోష్, ఈరిగిల గణేష్, కోరుమిల్లి శ్రీను, ద్వారపురెడ్డి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభీష్టాన్ని పట్టించుకోని
చంద్రబాబు ప్రభుత్వం
యలమంచిలి ఎమ్మెల్యే,
ఎంపీ ఏం చేస్తున్నారు?
అడ్డురోడ్డు కనీసం పంచాయతీ
కూడా కాదు
ప్రభుత్వ నిర్ణయంపై
నిప్పులు చెరిగిన కరణం ధర్మశ్రీ


