ముక్కోటి దేవతలు ఒక్కటయ్యేవేళ..
● రేపే వైకుంఠ ఏకాదశి
● ఉపమాకలో ఘనంగా ఏర్పాట్లు
విద్యుత్ కాంతులీనుతున్న
ఉపమాకలోని స్వామివారి ఆలయం
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాకలో వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని ఈనెల 30వ తేదీ మంగళవారం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. మూడు కోట్ల మంది దేవతలకు రాక్షస బాధల నుంచి విముక్తి కల్పించిన రోజు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ పర్వదినం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు ఇక్కడ ఉదయం 3 గంటలకు తొలి అభిషేకం చేస్తారు. ముక్కోటి ఏకాదశినాడు సాయంత్రం స్వామివారిని రంగనాథుడిగా అలంకరిస్తారు. శ్రీదేవి, భూదేవి కాళ్లు వత్తుతున్నట్లుగా అలంకరించి పుణ్యకోటి వాహనంపై వేంచేయింపజేస్తారు.
ఉపమాకలో అనునిత్యం ఉత్తరద్వార దర్శనమే
వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు. తద్వారా ముక్తికి మార్గం సుగమమయిందని భక్తులు భావిస్తారు. తిరుపతి, సింహాచలనం, అన్నవరం, భద్రాచలం తదితర వైష్ణవ క్షేత్రాల్లో ముక్కోటి ఏకాదశినాడే ఉత్తరద్వార దర్శనం కల్పిస్తే.. ఉపమాకలో అనునిత్యం ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. ఇక్కడ గరుడాద్రి పర్వతంపై స్వామివారు కల్కి అవతారంలో స్వయంవ్యక్తమై షఢ్భుజాలతో అశ్వారూఢుడై వెలిశారు.
8 వాహనాల్లో తిరువీధి సేవలు
ముక్కోటి ఏకాదశినాడు ఎక్కడా లేని విధంగా ఉపమాక పుణ్యక్షేత్రంలో ఎనిమిది వాహనాల్లో తిరువీధి సేవలు నిర్వహిస్తారు. రాజాధిరాజ వాహనంలో గోదాదేవి అమ్మవారిని పొన్న వాహనంలో, రుక్మిణి సహిత వేణుగోపాలస్వామిని ఆంజనేయ వాహనంపై, సీతారాములను పల్లకిపై, ఇతర వాహనాలపై బాలరాముడు, తాండవ కృష్ణుడు, ప్రాకార పెరుమాళ్లను ఉంచి తిరువీధి సేవలు నిర్వహిస్తారు.
టీటీడీ విస్తృత ఏర్పాట్లు
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని, గోపురాలను సర్వాంగ సుందరంగా పూలమాలలతో అలంకరించారు. విద్యుద్దీపాలంకరణ చేశారు. బేడా మండపం, మహాద్వారం, ధ్వజస్తంభాల వద్ద పూలాలంకరణ చేసి పెంటార్లు, షామియానాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనాలు కల్పిస్తామని, సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవలు జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు.
సింహగిరి సిద్ధం
సింహాచలం: ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుక లకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించనున్నారు. పోలీసు, జీవీఎంసీ, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత వెల్లడించారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధ న వంటి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై వేంజేంపు చేస్తారు. తెల్లవారుజాము న 5 గంటలకు ఉత్తర ద్వారం వద్ద మేలిముసుగు తొలగించి దర్శనాలకు అనుమతిస్తారు.
ముక్కోటి దేవతలు ఒక్కటయ్యేవేళ..
ముక్కోటి దేవతలు ఒక్కటయ్యేవేళ..


