బ్రహ్మాస్త్రం
● కన్నుకుట్టి కుతంత్రం.. కుంటిసాకుతో అడ్డంకులు
చిరుద్యోగిపై
విశాఖ సిటీ : వీఎంఆర్‌డీఏ అధికారుల రాజకీయాలకు ఒక చిరుద్యోగిని బలి చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి.. చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి నిబంధనల్లో డొంకలు వెతుకుతూ ఆర్‌ఐపై వేటు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉండడం అధికార పార్టీకి కన్నుకుట్టింది. ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న కుతంత్రంతో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చింది. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ముందస్తుగా చేసుకున్న బుకింగ్‌ను కూడా రద్దు చేయించింది. దీనికి అధికారులతో చెప్పించిన కుంటి సాకు దుమారం రేపుతోంది. అంతటితో ఆగకుండా ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయించడం ఇప్పుడు సంస్థలో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాలకు కింది స్థాయి సిబ్బందిని బలి చేయడాన్ని ఉద్యోగులు తప్పుబడుతున్నారు.
ఏడాదిన్నరలోనే వ్యతిరేకత
చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకపోవడం.. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల్లో కోత.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. స్టీల్‌ప్లాంట్‌లో కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నా పట్టించుకోకపోవడం.. విశాఖలో విలువైన భూములను ఊరూపేరు లేని బోగస్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టడం.. ఇలా చంద్రబాబు వరుస నిర్ణయాల పట్ల ప్రజలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ఆ పార్టీల నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. దీంతో అధికార పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి నేతలు వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సుమారు 1400 మంది వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆ పార్టీ ఈ చేరికలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 22వ తేదీన చేరికల కార్యక్రమం కోసం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాను ముందస్తుగా ఆ పార్టీ నేతలు బుకింగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి రుసుము కూడా చెల్లించారు.
ముందస్తు బుకింగ్ ఉన్నప్పటికీ..
వైఎస్సార్‌సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోడానికి చంద్రబాబు సర్కార్ అధికార బలాన్ని ప్రదర్శించింది. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని వీఎంఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి చేసింది. దీంతో అధికారులు చేసేదేమీ లేక కుంటి సాకులతో చేరికల కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించారు. ఉదయం 10.30 గంటలకు చిల్డ్రన్స్ ఎరీనా కార్యక్రమం ఉండడంతో ఈలోగానే సిబ్బందితో గేటుకు తాళం వేయించారు. చిల్డ్రన్స్ ఎరీనా ప్రాంగణంలో పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకూడదన్న నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వాటిని తొలగించారు. అంతేకాకుండా చిల్డ్రన్స్ ఎరీనా హాల్‌లో ఆకస్మాత్తుగా ఏసీ పనిచేయడం లేదని, మరమ్మతులు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కార్యక్రమం నిర్వహించే అవకాశం లేదని రద్దు చేశారు. ముందస్తు బుకింగ్ చేసుకున్నప్పటికీ.. ఎటువంటి సమాచారం లేకుండా ఎలా రద్దు చేస్తారని అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇంతలో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేశారు. ఒక పథకం ప్రకారమే తమ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. చిల్డ్రన్స్ ఎరీనా గేటు ముందే బైఠాయించి కొంత సేపు నిరసన తెలిపారు. అనంతరం అక్కడే సుమారు 1,400 మందిని పార్టీలో చేర్చుకున్నారు.
వీఎంఆర్‌డీఏలో రాజకీయాలకు చిరుద్యోగి బలి
వైఎస్సార్‌సీపీ చేరికల కార్యక్రమానికి ముందస్తు అనుమతులున్నా రద్దు
ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన
అధికారులు
చిల్డ్రన్స్ ఎరీనాలో చేరికల సమాచారం ఇవ్వలేదన్న కారణంతో ఆర్‌ఐపై వేటు
వై.కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆదేశాలు
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు


