● పేదోడి కడుపు మండింది.. మట్టి పన్నుపై గట్టి ప్రతిఘటన
● తిరగబడ్డ ప్రజలు, ట్రాక్టర్ యజమానులు
● ఏటిగైరంపేటలో అనధికార వసూళ్లపై గ్రామస్తుల మండిపాటు
గొలుగొండ: చంద్రబాబు పాలనలో అక్రమార్కు లు చెలరేగిపోతున్నారు. మట్టి కావాలన్నా పన్ను కట్టాలట. ట్రాక్టర్ మట్టి తరలించడానికి ఏకంగా రూ.410 పన్ను కట్టమని అనధికార సంస్థ బళ్లను ఆపడంతో ప్రజలు తిరగబడ్డారు. పాక, ఇంటి కప్పుడుకు సొంత పొలంలో మట్టి తరలించడానికి పన్ను కట్టమంటే వారికి చిర్రెత్తుకొచ్చింది. సొమ్ము చెల్లించకపోతే ట్రాక్టర్, లారీ, పొక్లెయిన్ సీజ్ చేస్తామని చెప్పడంతో అడ్డుకోవడానికి మీరెవరంటూ గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఏటిగైరంపేట గ్రామ పరిధిలో ఒక రైతు పొలం వద్ద పాక వేశారు. దీనికి కప్పుడు మట్టి అవసరం కావడంతో వేరొక ప్రాంతంలో తన పొలంలోని మట్టిని ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఇంతలో ఏఎంఆర్ అనే సంస్థ సిబ్బంది వచ్చి ట్రాక్టర్లను నిలిపివేశారు. యూనిట్ మట్టి తరలించాలన్నా రూ.410 పన్ను కట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఏటిగైరంపేట, పాలకపాడు, పుత్తడిగైరంపేట గ్రామాలకు చెందిన ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండిపడ్డారు. గ్రామాల్లో మట్టి తరలిస్తే చంద్రబాబు పాలనలో రూ.410 పన్ను ఎందుకు కట్టాలని దుయ్యబట్టారు. మేం కట్టం.. ఏం చేసినా పర్వాలేదని తిరుగుబాటు చేశారు. వ్యవసాయ కుటుంబాల్లో దిబ్బ లుగా ఉన్న పొలాన్ని చదును చేయడం, లోతుగా ఉన్న పొలంలో మట్టివేయడం జరుగుతుంది. అ లాంటి సమయంలో పన్ను కట్టమనడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. అసలు ఈ ఏఎంఆర్ సంస్థకు ఏ అనుమతులు ఉన్నాయని నిలదీశారు. ట్రాక్లర్లను అడ్డుకుంటే తీవ్రంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇక్కడ ఉన్న సిబ్బంది మెల్లగా జారుకున్నారు.
అయ్యన్ననే అడుగుదాం..
ఇలా పేద ప్రజలకు అన్యాయం చేయడంపై బుధవారం స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లి సమస్య వివరిస్తామని ట్రాక్టర్ యజమానులు తెలిపారు. పేదలకు అన్యాయం చేసే ఈ సంస్థ ఎక్కడ నుండి వచ్చిందో తెలపాలని, తమకు న్యాయం చేయాలని కోరతామన్నారు. పాక, ఇంటి అవసరాల కోసం సొంత పొలంలో మట్టి తరలిస్తే ట్రాక్టర్‌కు రూ.410 ఎలా పన్ను విధిస్తారు.. ఎందుకు ఇవ్వాలని అయ్యన్న ఇంటి వద్దకు వెళ్లి అడుగుతామన్నారు. ఇలా అయితే తామెలా బతకాలని ట్రాక్టర్ యజమాని సత్తిరాజు ఆవేదనగా ప్రశ్నించారు.
● పేదోడి కడుపు మండింది.. మట్టి పన్నుపై గట్టి ప్రతిఘటన


