
వడ్డాది హెచ్‌ఎం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
బుచ్చెయ్యపేట: మేజర్ పంచాయితీ వడ్డాది కోవెల అప్పన్నదొర జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎం ప్రసన్నకళ తీరుపై తల్లిదండ్రులు, గ్రామ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్కూల్ చైర్మన్ మేడివాడ రమణ, గ్రామ నాయకులు దొండా నరేష్, తలారి శంకర్, గురుమూర్తి, సూరిబాబు, తదితరులు హెచ్‌ఎంపై మండిపడ్డారు. మూడు నెలలుగా ఓ బయట యువకుడిని తీసికొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఉంచడాన్ని తప్పుపట్టారు. ఆ యువకుడు 8, 9, 10వ తరగతి విద్యార్థినుల ఫొటోలు తీయడం, ఫోన్ నంబర్లు తీసుకుని వేధించడంపై హెచ్‌ఎంను నిలదీశారు. విధుల్లో చేరి మూడు నెలలైనా గత హెచ్‌ఎం నుంచి ఎందుకు చార్జ్ తీసుకోలేదని ఆమెను ప్రశ్నించారు. పాఠశాలలో నాడు–నేడు పనులకు సంబంధించిన సుమారు 200 సిమెంట్ బస్తాలు గడ్డకట్టి పాడైనా పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాల వాతావరణం మార్చకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు రాజకీయాలను పక్కనపెట్టి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు కృషి చేయాలని సూచించారు.