
● వీఎంఆర్‌డీఏ ఆఫీసు ఎదుట అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు న
సాక్షి, విశాఖపట్నం:
అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులు కదం తొక్కారు. నష్టపరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయం ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని నినదించారు. అనంతరం రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము ఆధ్వర్యంలో నిర్వాసితులు వీఎంఆర్‌డీఏ కమిషనర్ విశ్వనాథన్‌కు వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని, అయినా బాండ్లే ఇస్తామని అధికారులు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వాపోయారు. మూడు రోజుల క్రితం అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై మండిపడ్డారు. నిర్వాసితులంతా పేదవారని, వారికి టీడీఆర్ బాండ్లు ఏమా త్రం ఉపయోగపడవని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలో నష్ట పరిహారం అందించి, తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చే శారు. ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలన్నారు. 100 అడుగుల తర్వాత నిర్మించుకునే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు విధించరాదన్నారు.
మూడు నియోజకవర్గాలు..
1225 మంది బాధితులు
అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ కోసం మూడు నియోజకవర్గాల పరిధిలో 125 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో దాదాపుగా 1225 మంది నిర్వాసితులున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి మాన్యంలో ఉన్న 12 మంది నిర్వాసితులకు, ఆర్‌అండ్‌బీ, పీడబ్ల్యూ స్థలాల్లో ఉన్న 62 మంది నిర్వాసితులకు బలవంతంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. మిగిలిన నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు తీసుకోకుండా వ్యతిరేకించారు. ఆరునూరైనా తీసుకోరాదని పట్టుదల గా ఉన్నారు.