
తీవ్ర విషాదం.. ఎవరిదీ పాపం.!
తాచేరు కట్టెల వంతెన మీద నుంచి కాలు జారి పడి గిరిజన మహిళ మృతి
తాటిపర్తి శివారు ఆజయపురం గ్రామస్తులకు ఈ కట్టెల వంతెనే దిక్కు
మృతదేహంతో గిరిజనుల నిరసన
మాడుగుల రూరల్: తాచేరు గెడ్డపై ఉన్న కట్టెల వంతెన మీద నుంచి నడిచి వెళ్తుండగా ఓ గిరిజన మహిళ కాలు జారి గెడ్డలో పడి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో తాటిపర్తి పంచాయతీ శివారు ఆజయపురం గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళ పాంగి మచ్చమ్మ(26) పామాయిల్ తోటలో కూలి పనికి వెళ్లింది. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గురువారం రాత్రి తాచేరు గెడ్డలో కట్టెల వంతెన మీద నుంచి నడిచి వెళ్తుండగా కాలు జారి గెడ్డలో పడి మృతి చెందింది. ఈ గ్రామానికి వంతెన లేకపోవడంతో తాత్కాలికంగా గిరిజనులు కట్టెల వంతెన నిర్మించుకున్నారు. మచ్చమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమని రోదించారు. మృతురాలి భర్త మత్స్యరాజు శుక్రవారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ జి.నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని శుక్రవారం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారైలు, అత్తమామలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
గిరిజన మహిళ మృతి ప్రభుత్వానిదే బాధ్యత
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆజయపురం వెళ్లే రహదారిలో తాత్కాలిక వంతెన మీద మృతదేహంతో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన జిల్లా కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, మాట్లాడుతూ ఆజయపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాటిపర్తి నుంచి ఆజయపురం గ్రామానికి మధ్యలో గెడ్డపై కర్రలతో కాలిబాట వంతెన నిర్మించుకున్నారని, ఈ వంతెన మీద నడుస్తూ గెడ్డలో పడి మహిళ మృతి చెందిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శంకరం పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గండి వద్ద నది దాటేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు
తాచేరు నదిలో తాడు సహాయంతో వెళ్తున్న గ్రామస్తులు
బుచ్చెయ్యపేట: మండలంలోని భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో విజయరామరాజుపేట తాచేరు నదిలో తాడు సహాయంతో దిగి పలువురు ప్రమాదం అంచున ప్రయాణాలు చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న తాచేరు వంతెన కూలిపోగా తాత్కలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు నెల రోజుల కిందట వర్షాలకు కొట్టుకుపోయింది.
దీంతో నదికి అవతల, ఇవతల పొలాలు ఉన్న విజయరామరాజుపేట రైతులు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా తీగ సహాయంతో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. పేట రైతులకు ఏ అవసరం వచ్చినా వడ్డాది వచ్చి సరకులు కొనుగోలు, అత్యవసర సమయంలో రోగులు ఆసుపత్రికి వెళ్లడానికి, మందులు కొనుగోలు చేయడానికై తాచేరు నదిలో దిగి నీటిలో నుంచి నడిచి వెళ్తున్నారు. ఏప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. పాలకులు, అధికారులు తక్షణం కూలిన వడ్డాది, తాచేరు వంతెనలు, డైవర్షన్ రోడ్ల నిర్మాణాలు చేపట్టి రవాణా సదుపాయం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తీవ్ర విషాదం.. ఎవరిదీ పాపం.!