
దొంగతనాలకు పాల్పడుతున్న యువకుల అరెస్ట్
అచ్యుతాపురం రూరల్ : రెండు నెలల వ్యవధిలో మండలంలో పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన నలుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. జిల్లా ఎస్‌పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్‌పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో నియమించిన ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి చోరీలకు పాల్పడిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో జోగన్నపాలెం, మార్టూరు, దొరైపాలెం, పైలవానిపాలెం, వెంకటాపురం గ్రామాల్లో మొత్తం ఐదు ఆలయాల హుండీలను చోరీ చేసినట్టు గుర్తించామని, వారి నుంచి రూ.7650 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లల నడవడికను ప్రతిక్షణం గమనించాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులెవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. వీలైనంత వరకూ వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు తెలియపరిచి ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు సుధాకర్, వెంకటరావు, సిబ్బంది బంగార్రాజు, అనిల్ పాల్గొన్నారు.