కరెంట్‌ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా.. | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..

Sep 6 2025 5:15 AM | Updated on Sep 6 2025 5:15 AM

కరెంట

కరెంట్‌ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..

ఈపీడీసీఎల్‌ పరిధిలో సబ్‌స్టేషన్లకు

మొదటి విడతలో 40 స్టేషన్లలో అమలు

మరో 24 సబ్‌స్టేషన్లలో

పనులు వేగవంతం

సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సమస్య ఎక్కడుందో కనుగొనడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది. లోపం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సబ్‌స్టేషన్‌కు సమాచారమిచ్చి, విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన తర్వాత మరమ్మతులు చేసేవారు. ఈ ప్రక్రియకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కానీ, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో పరిస్థితులు మారాయి. ఇప్పుడు విద్యుత్‌ సరఫరాలో లోపం ఎక్కడ తలెత్తిందో క్షణాల్లోనే కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపిస్తోంది. ఆ సమాచారంతో సంబంధిత సిబ్బంది కేవలం 5 నుంచి 30 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఇది తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) పరిధిలో అమలు చేస్తున్న సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (స్కాడా) వ్యవస్థతో సాధ్యమవుతోంది. విశాఖపట్నం సర్కిల్‌ పరిధిలో ఇప్పటికే సగానికి పైగా సబ్‌స్టేషన్లు స్కాడాతో అనుసంధానం కావడంతో నగరవాసులకు విద్యుత్‌ సమస్యలు గణనీయంగా తగ్గాయి.

స్కాడా అంటే.?

విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తూ.. సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించి, సరఫరాను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవస్థే స్కాడా. ఇది సెన్సార్లు, రిమోట్‌ టెర్మినల్‌ యూనిట్ల ద్వారా సబ్‌స్టేషన్లను కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానిస్తుంది. ఆపరేషనల్‌ టెక్నాలజీ ద్వారా రియల్‌ టైమ్‌ డేటాను సేకరించి, వ్యవస్థను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్లు చేసే పనులను స్కాడా కంట్రోల్‌ సెంటర్‌ నుంచే ఆటోమేటిక్‌గా, రిమోట్‌ సెన్సార్ల సహాయంతో నిర్వహిస్తారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో...

విశాఖ నగరంలో స్కాడా ఏర్పాటుకు 2013లో ప్రతిపాదనలు రాగా, 2014లో రూ.13.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2015 నుంచి మొదలుపెడితే 28 సబ్‌స్టేషన్లను స్కాడా కంట్రోల్‌ స్టేషన్‌కు అనుసంధానం చేశారు. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత మరో 12 స్టేషన్లను అనుసంధానం చేయడంతో పాటు మరో 24 సబ్‌స్టేషన్లను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చే పనులు ప్రారంభమై.. చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సబ్‌స్టేషన్లలోనూ స్కాడా అమలుకానుంది. విశాఖపట్నం సర్కిల్‌ పరిధిలో మొత్తం 130 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 40 స్టేషన్లు ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయి. మరో 24 స్టేషన్లలో త్వరలోనే సేవలు మొదలుకానున్నాయి. మిగిలిన కేంద్రాలను కూడా భవిష్యత్తులో అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

కంట్రోల్‌ సెంటర్‌ ఎక్కడంటే..?

స్కాడా పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లను పెదవాల్తేరులోని పోలమాంబ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షిస్తారు. ఇది అత్యంత కీలకమైన, సాంకేతికతతో కూడిన కార్యాలయం కావడంతో దీనిని నియంత్రిత ప్రాంతంగా (నిషిద్ధ ప్రాంతం) పరిగణిస్తారు. సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసి నగర విద్యుత్‌ వ్యవస్థను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉన్నందున ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈపీడీసీఎల్‌ ప్రత్యేక నిపుణుల బృందం (ఈఈ, డీడీఈ, ఏఈ స్థాయి అధికారులతో పాటు 8 మంది షిఫ్ట్‌ ఇంజినీర్లు) ఈ కేంద్రాన్ని 24/7 పర్యవేక్షిస్తోంది. స్కాడాకు అనుసంధానించిన సబ్‌స్టేషన్‌ పరిధిలో ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాలో లోపం వస్తే, వెంటనే కంట్రోల్‌ రూమ్‌లో అలారమ్స్‌ మోగుతాయి. హై వోల్టేజ్‌, లో వోల్టేజ్‌ వంటి హెచ్చుతగ్గులను కూడా ఈ కేంద్రం నుంచే నియంత్రించవచ్చు. ఏ ప్రాంతానికి ఎంతసేపు విద్యుత్‌ సరఫరా చేశారు, ఎంతసేపు కోతలు విధించారు, లోడ్‌ ఎంత ఉంది వంటి సమాచారం మొత్తం రియల్‌ టైమ్‌ డేటా రూపంలో నిక్షిప్తమవుతుంది.

ప్రమాదాలు తగ్గుముఖం

స్కాడా కంట్రోల్‌ స్టేషన్‌ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండటంతో.. ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. విద్యుత్‌ సరఫరాలో నాణ్యత ఉంటోంది. స్కాడాకి అనుసంధానం చేయడం వల్ల సరఫరాలో అంతరాయాలు గుర్తించి, పునరుద్ధరించడంలో 56 శాతం వరకు సమయం ఆదా అవుతోంది. పవర్‌ ట్రిప్‌ అయితే రియల్‌ టైమ్‌లో తెలుస్తోంది. స్క్రీన్‌పై నుంచే వోల్టేజ్‌, ఇతర అంశాల్ని నిశితంగా పరిశీలించవచ్చు. ఏ చిన్న సమస్య తలెత్తినా.. పసిగట్టగలుగుతున్నాం. గతంలో ఫీడర్‌ మార్పు చేసేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాల్లో ఫీడర్‌ని మార్పు చేయగలుగుతున్నాం. గ్రామస్థాయిలో ఫీడర్ల వరకూ స్కాడా అనుసంధానం చేసేందుకు కొంత సమయం పడుతుంది.

–జి.శ్యామ్‌బాబు, విశాఖపట్నం సర్కిల్‌ ఎస్‌ఈ

‘స్కాడా’ అనుసంధానం

కరెంట్‌ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..1
1/2

కరెంట్‌ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..

కరెంట్‌ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..2
2/2

కరెంట్‌ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement