తగ్గేదేలే..! | - | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే..!

Aug 23 2025 2:11 AM | Updated on Aug 23 2025 2:11 AM

తగ్గే

తగ్గేదేలే..!

గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. పోలీసుశాఖ ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా లెక్క చేయడం లేదు. విద్యార్థులు, యువతకు డబ్బు ఎర వేసి, ఏజెన్సీ నుంచి వివిధ మార్గాల్లో గంజాయిని రప్పించి, జిల్లా నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎగుమతి చేస్తున్నారు.

సాక్షి, అనకాపల్లి:

గంజాయి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. తనిఖీలు అంతంతమాత్రంగా జరుగుతుండడంతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. గతంలో కన్నా ఈ ఏడాది గంజాయి కేసులు విపరీతంగా పెరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏవోబీ ప్రాంతంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడ నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈగల్‌ విభాగం, శాంతి భద్రతల పోలీసులు సంయుక్తంగా జిల్లాలో ఐదు స్టాటిక్‌ చెక్‌ పోస్టులు, 38 డైనమిక్‌ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు కప్పి మరీ తరలించేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ 10,091 కిలోల గంజాయిని, 9 వేల హషీష్‌ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 170 కేసుల్లో 500 మందిని అరెస్ట్‌ చేశారు. ఏడుగురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ఇంత పెద్ద మొత్తంలో ఉంటే పట్టుబడని గంజాయి ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పనవసరం లేదు.

కాలేజీ విద్యార్థులే టార్గెట్‌

స్మగ్లర్లు...యువత, విద్యార్థులే టార్గెట్‌గా గంజా యి రవాణా, విక్రయాలు సాగిస్తున్నారు. అటు ఏజెన్సీ, ఇటు మైదాన ప్రాంతానికి మధ్యలో గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండలాల మీదుగా జాతీయ రహదారికి, రైల్వే స్టేషన్లకు, విశాఖ నగరానికి గంజాయిని తరలిస్తున్నారు.

ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు, విద్యార్థులు గంజాయి సేవించడం, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతుండడంతో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

నర్సీపట్నం కేంద్రంగా...

గంజాయి విక్రయాలకు, వినియోగానికి నర్సీపట్నం కేంద్రంగా మారుతుండడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కళాశాలలు, విద్యా సంస్థల వద్ద కాపు కాసి కొన్ని ముఠాలు విద్యార్థులను గంజాయి ఉచ్చులోకి లాగుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. పట్టణంలో ఇటీవల గంజా యి సేవించే యువకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ప్రాంతాల్లో గంజాయి సులభంగా లభిస్తుండడంతో విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నట్టు సమాచారం. గంజాయి విక్రయిస్తున్నవారిలో యువతులు కూడా ఉండడంపై పోలీసులు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల ఇద్దరు యువతులను పోలీసులు విచారించి హెచ్చరించినట్టు తెలిసింది. ఏజెన్సీ నుంచి వచ్చే గంజాయి వ్యాపారులకు స్థానికంగా కొందరు షెల్టర్‌ ఇవ్వడంతో పాటు ఇక్కడ నుంచి పోలీసుల నిఘా లేని సమయాల్లో సులభంగా అనకాపల్లి, విశాఖనగరానికి గంజాయిని తరలించడంలో భాగస్వాములవుతున్నట్టు సమాచారం. వ్యాపారులు ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా చేయడంతో పాటు స్థానికంగా కళాశాల విద్యార్థులు, యువకులకు కూడా విక్రయిస్తున్నట్టు తెలిసింది.

జిల్లాలో కేసుల వివరాలు ఇలా..

2024 ఏడాదిలో(జూన్‌ నెల నుంచి డిసెంబర్‌ వరకూ) గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు 81 కేసులు నమోదు చేసి, మొత్తం 3,326.43 కిలోల గంజాయి, రెండు వేల లీటర్ల హషీష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 220 మందిని పోలీసులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న 96 మంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ గంజాయి రవాణాలో వినియోగిస్తున్న 113 వాహనాలను సీజ్‌ చేశారు.

2025లో జనవరి నెల నుంచి 89 గంజాయి కేసులు నమోదు చేసి, 280 మందిని అరెస్ట్‌ చేశారు. ఈకేసుల్లో రూ.3,39,43,600 విలువైన 6,765 కిలోల గంజాయి, 5.300 లీటర్ల హషీష్‌ ఆయిల్‌, 73 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఏడు గురిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. గంజాయి అక్రమ రవాణాలో ఆస్తులు సంపాదించిన ఇద్దరు స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేశారు.

రోలుగుంట పోలీసు స్టేషన్‌ పరిధిలో గల రత్నంపేట గ్రామానికి చెందిన పడాల నాగేశ్వరరావు గంజాయి క్రయ విక్రయాలు, అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 15.36 ఎకరాల వ్యవసాయ భూమిని ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని నిబంధనలు ప్రకారంగా స్వాధీనం చేసుకున్నారు.

పేట్రేగిపోతున్న గంజాయి స్మగ్లర్లు

యథేచ్ఛగా రవాణా

విద్యార్థులు, యువతే లక్ష్యం

ఏడాదిలో భారీగా పెరిగిన కేసులు

ఏజెన్సీ నుంచి అనకాపల్లి జిల్లా మీదుగా తరలింపు

తనిఖీలు అంతంత మాత్రమే

తగ్గేదేలే..! 1
1/1

తగ్గేదేలే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement