
ఎరువుల అక్రమ నిల్వలపై దాడులు చేయాలి
అనకాపల్లి: ఎరువుల అక్రమ నిల్వలపై జాయింట్ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అమరావతి నుంచి శుక్రవారం ఖరీఫ్–2025లో ఎరువుల లభ్యతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, తదితరులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ మండల స్థాయిలో మల్టీ డిసిప్లినరీ టీమ్స్‌ను సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్‌హెచ్‌వోలు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంఏవోలతో ఏర్పాటు చేసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. యూరియా గురించి ప్రతికూల వార్తలు వచ్చినప్పుడు వాస్తవ పరిస్థితులు బట్టి వివరణ ఇవ్వాలన్నారు. జిల్లాలో ఉన్న సాగు విస్తీర్ణంను బట్టి ఎరువుల సరఫరా, లభ్యత వివరాలను ప్రతి రోజూ కలెక్టర్ కార్యాలయానికి సమర్పించాలని చెప్పారు. ప్రతి ఎరువుల షాపు వద్ద ఓ వీఆర్‌ఏను నియమించి అమ్మకాలను పర్యవేక్షించాలన్నారు. ఆర్‌ఎస్‌కే పరిధిలో పంటల సాగు విస్తీర్ణానికి అవసరమైన యూరియా లభ్యత వివరాలు రోజూ 8 గంటలకు మల్టీ డిసిప్లినరీ కమిటీకి తెలియజేయాలని ఆమె సూచించారు. జిల్లా వ్యవసాయ, ఎంపీడీవో కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.
ఎక్కడైన సమస్యలు ఉంటే జిల్లా వ్యవసాయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 8331056471లో సంప్రదించాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.