
బొడ్డేరు నదిపై కుంగిన వంతెన
కుంగిపోయిన వంతెన
బుచ్చెయ్యపేట: మండల శివారు విజయరామరాజుపేట, చీడికాడ మండలం కట్టవాని అగ్రహారం గ్రామాల మధ్య బొడ్డేరు నదిపై గల వంతెన కుంగిపోయింది. దీంతో రెండు మండలాల్లో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో అధిక లోడుతో లారీ వెళుతుండగా వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ సమ యంలో మూడు చోట్ల బ్రిడ్జి దెబ్బతింది. దీంతో నడిచివెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. వంతెనకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు, కాపలా ఏర్పాటు చేశారు. వంతెన కుంగిపోవడంతో ముఖ్యంగా విజయరామరాజుపేట,కట్టువాని అగ్రహారం,దండి సురవరం,దిబ్బిపాలెం, ఇంటిపాలెం,తునివలస,చీడికాడ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే బుచ్చెయ్యపేట మండలంలో భీమునిపట్నం,నర్సీప ట్నం(బీఎన్) ప్రధాన రోడ్డులో వడ్డాదిలో పెద్దేరు నదిపై ఉన్న పెద్దేరు వంతెన, విజయరామరాజుపేట వద్ద తాచేరు నదిపై ఉన్న తాచేరు వంతెన శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్లు మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు కొట్టుకుపోయాయి. దీంతో అనకాపల్లి,అల్లూరి,విశాఖపట్నం జిల్లాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.ఇప్పుడు బొడ్డేరు నదిపై గల వంతెన కుంగిపోయింది. రెండు మండలాలను కలిపే లింకు రోడ్డులో ఏర్పాటు చేసిన వంతెన కూలడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 ఏళ్ల కిందట బొడ్డేరు నదిపై ఈ వంతెన నిర్మించారు. దేవరాపల్లి, చీడికాడ, బుచ్చెయ్యపేట, మాడుగుల, రావికమతం మండలాల్లో జరిగే వారపు సంతల్లో విక్రయించేందుకు రైతులు పంటలు,పాడి పశువులు,గొర్రెలు,మేకలు,నాటుకోళ్లు రవాణా చేసేందుకు ఈ రహదారినే ఎక్కువగా వినియోగిస్తారు. కూలిన వంతెన ప్రదేశంలో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు వంతెన నిర్మించాలని బుచ్చెయ్యపేట,చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల తదితర మండలాల ప్రజలు కోరుతున్నారు.