
ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి
● భద్రాచలం– విశాఖపట్నం
నైట్ సర్వీసుకు పగిలిన అద్దాలు
చింతూరు: భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్తున్న నైట్‌సర్వీసు బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు భద్రాచలంలో బయలుదేరిన అల్ట్రా డీలక్స్ బస్సు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లిలో ప్రయాణికులను దింపేందుకు ఆగింది. ఈ క్రమంలో చీకటిలోంచి ఓ రాయి వేగంగా వచ్చి బస్సు ఎడమవైపు అద్దాన్ని వేగంగా తాకి లోపలికి దూసుకొచ్చింది. కుడివైపు అద్దాన్ని దూసుకుంటూ బయటకు వెళ్లిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఇదే సమయంలో డ్రైవరు బస్సును కొంత ముందుకు తీసుకెళ్లి తిరిగి వెనక్కి తీసుకురావడంతో మరోసారి బస్సుపై రాయితో దాడి జరిగిందని వారు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. బస్సును స్థానిక పోలీసుస్టేషన్ వద్దకు తీసుకొచ్చి జరిగిన ఘటనపై డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.