
నర్సీపట్నంలో నిఘా కెమెరాలు పెంచండి
ఎస్పీ తుహిన్ సిన్హా
నర్సీపట్నం: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నంలో ప్రధాన కూడళ్లలో నిఘా కెమెరాల సంఖ్య పెంచాలని ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. బుధవారం సాయంత్రం నర్సీపట్నం టౌన్ పోలీసు స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీషీటర్లపై మరింత నిఘా పెంచాలని సిబ్బందికి సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లపై ఉన్న ముద్దాయిలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దొరికిన వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోమన్నారు. పోలీసు స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నర్సీపట్నంలోని ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో నిఘా కెమెరాల సంఖ్య పెంచాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని టౌన్ సీఐ గోవిందరావుకు సూచించారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.