
పెన్షన్లు పీకేస్తే.. ప్రజలు మిమ్మల్ని పెకిలిస్తారు
కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త ధర్మశ్రీ హెచ్చరిక
అచ్యుతాపురం: అధికారం ఉంది కదా అని పెన్షన్లను ఇష్టారాజ్యంగా పీకేస్తున్నారని.. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పెకిలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండలంలోని తంతడి, రాజన్నపాలెం, నునపర్తి గ్రామాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అభాగ్యుల పెన్షన్లు రద్దు చేసి ఏం సాధిస్తారని, ప్రజలకు అండగా నిలవడం నేర్చుకోవాలని హితవు పలికారు. తంతడి పరిధిలోని బార్క్ భూములు కోల్పోయిన వారి జాబితా తయారీలో బినామీలను చేరుస్తున్నారని, అటువంటి చర్యలను అంగీకరించేది లేదని హెచ్చరించారు. బార్క్ నిర్వాసితుల తరపున పోరాడతామన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి కాబట్టి అమలు సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదన్నారు. ఫ్రీ బస్ ప్రకటించడం గొప్ప కాదని, ముందు అన్ని గ్రామాలకు బస్సులు వెళ్లేలా చేస్తే అప్పుడు మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. నియోజకవర్గంలోని మత్స్యకార సమస్యలపై పోరాడతామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్‌రావు, జెడ్పీటీసీ లాలం రాంబాబు, కో ఆప్షన్ జెడ్పీటీసీ నర్మాల కుమార్, పార్టీ నాయకుడు కోన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

పెన్షన్లు పీకేస్తే.. ప్రజలు మిమ్మల్ని పెకిలిస్తారు