
అంధురాలికి అన్యాయం
వచ్చే నెల నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి వర్తమానం
పాయకరావుపేట: పుట్టుకతోనే ఆమె అంధురాలు. దివ్యాంగుల సామాజిక పింఛన్ రూ.1500 ఉన్నప్పటి నుంచి అందుకుంటోంది. వచ్చే నెల నుంచి పెన్షన్ నిలిపివేస్తున్నట్టు హఠాత్తుగా ప్రభుత్వం నుంచి వర్తమానం అందడంతో ఆమె కంగుతింది. కంగారు పడింది. తనకు దిక్కెవ్వరని లబోదిబోమంటోంది. పట్టణంలో నివసిస్తున్న ఈగల సత్తిబాబు, లోవతల్లి దంపతుల కుమార్తె ఈగల శాంతాదేవి. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు బొబ్బిలిలోని ‘ఆసియాన్ ఎయిడ్ స్కూల్ ఫర్ ది బ్‌లైండ్’ పేరుతో నడుస్తున్న అంధుల పాఠశాలలో చదువుకుంది. డిగ్రీ విజయనగరంలోని ఏజీఎల్ కళాశాల పూర్తి చేసింది. తనకు పూర్తి స్థాయిలో అంధత్వం ఉందని, ప్రతి నెల రూ.6 వేల పింఛన్ వచ్చేదని ‘సాక్షి’కి వివరించింది. మార్చి నెలలో జరిగిన సదరం సర్టిఫికెట్ల పరిశీలనలో 40 శాతం మాత్రమే వైకల్యం ఉందని నిర్ధారణ జరిగినందున పింఛన్ నిలిపివేస్తున్నట్టు మండల పరిషత్ కార్యాలయం నుంచి లెటర్ వచ్చిందని తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధులని, తండ్రి ఒక రైతు వద్ద పశువుల కాపరిగా పనిచేస్తున్నారని వివరించింది. తనకు ఉద్యోగం రాలేదని, పింఛను పైనే ఆధారపడి జీవిస్తున్నానని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.