నక్కపల్లి: గ్రామాల్లో నిర్మించిన సంపద తయారీ కేంద్రాల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసే కార్యకలాపాలు చేపట్టాలని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి నారాయణమూర్తి సూచించారు. బుధవారం ఆయన దేవవరం, ఒడ్డిమెట్ట, ఉద్దండపురం గ్రామాల్లో పర్యటించారు. ఐవీఆర్‌ఎస్ గ్రామాలుగా గుర్తించిన పంచాయతీల్లో శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎంపీడీవోలు, కార్యదర్శులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే పర్యటించి, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేవవరం సంపద తయారీ కేంద్రంలో ఇళ్ల నుంచి సేకరించిన తడిపొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను స్థానిక క్లాప్ మిత్రలు చేపట్టారు. ఇలా వేరు చేసిన చెత్త నుంచి వర్మికంపోస్టు (సేంద్రియ ఎరువులు) తయారు చేసేందుకు గాను వానపాములను విడుదల చేశారు. అనంతరం ఒడ్డిమెట్ట గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. తదుపరి ఉద్దంపురంలో రక్షిత మంచినీటి పథకాల్లో క్లోరినేషన్ పనులను పరిశీలించారు. రైతు సేవాకేంద్రాలను తనిఖీ చేసి ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయో లేవో ఆరా తీశారు. వెల్‌నెస్ సెంటర్లో సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది సహకారంతో గ్రామాల్లో క్లోరినేషన్ చేయించాలన్నారు. ఒడ్డిమెట్ట గణపతి ఆలయాన్ని సీఈవో దర్శించుకున్నారు. ఎంపీడీవో సీతారామరాజు, డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు, సర్పంచ్‌లు జి.నర్సింహమూర్తి, పి.వెంకటేష్, ఉప సర్పంచ్ వేగేశ్న చంటి, కార్యదర్శశి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.