
వెంకటాపురం మాదిరిగా మాకూ నిధులివ్వాలి
ఎస్.రాయవరం: ఎనిమిది వందల ఓట్లు ఉన్న వెంకటాపురం గ్రామానికి ఏడాదిలో రూ.3 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అదే ప్రాతిపదికన నియోజకవర్గంలో ఉన్న 108 గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని తెలుగు తమ్ముళ్లు, కూటమి నాయకులు ముక్కుసూటిగా మంత్రికి విన్నవించారు. మండలంలో వెంకటాపురం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆమె మంగళవారం విచ్చేశారు. ముందుగా మండల కేంద్రం నుంచి వెంకటాపురం వరకు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ఆసక్తికరంగా లేకపోవడంతో ఎస్.రాయవరం దాటాక స్కూటీ ఎక్కి మంత్రి ప్రయాణం చేశారు. లింగరాజుపాలెం వెళ్లే సరికి స్కూటీని కూడా పక్కన పెట్టి తన వాహనంపై వెంకటాపురం చేరుకున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్, పంచాయతీ రాజ్, జెడ్పీటీసీ నిధులతో చేపట్టిన పార్క్, సీసీ, తారు రోడ్లను ఆమె ప్రారంభించారు. అనితమ్మ పేరున ఏర్పాటు చేసిన పార్కుకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను అంగన్‌వాడీ టీచర్లు, వెలుగు సిబ్బంది, వీఆర్పీలు, ఆశా వర్కర్లతో నింపేశారు. ట్రాక్టర్ల ర్యాలీ కారణంగా తలెత్తిన ట్రాఫిక్‌లో కలెక్టర్ కారు చిక్కుకుపోయింది. దీంతో ప్రారంభోత్సవాలు ముగిసే సరికి కలెక్టర్ విజయ కృష్ణన్ మంత్రిని కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో రమణ, వ్యవసాయ అధికారులు ఉమాప్రసాద్, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు. కర్రివానిపాలెం గ్రామానికి చెందిన 100 శాతం వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులు మంగళవారం మంత్రికి తమ గోడును విన్నవించుకున్నారు. దిగుమర్తి కుసుమ, పోతు పల్లవి తమకు రూ.15 వేలు పింఛన్‌కు అర్హత ఉన్నా ఇవ్వడం లేదని వాపోయారు. సానుకూలంగా స్పందించిన మంత్రి రూ.15 వేలు పింఛన్ వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.
పేదరిక నిర్మూలనకు కృషి
అచ్యుతాపురం రూరల్ : పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. మంగళవారం స్థానిక ఎంఎస్‌ఎంఈ కేంద్రంలో పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
హోంమంత్రి అనితకు కూటమి నాయకుల విజ్ఞప్తి
పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం