
పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ప్రణాళిక
అచ్యుతాపురం : పరిశ్రమల జరిగే ప్రమాదాల నివారణకు తగిన ప్రణాళికలు కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అచ్యుతాపురం పోలీస్ స్టేషన్‌ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. ప్రమాదం జరిగితే స్పందించాల్సిన విధానంపై తగిన సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ప్రమాదాల నివారణకు సేప్టీ ట్రైనింగ్ ఇస్తున్నామని, దీనిపై తగిన పర్యవేక్షణ కలిగి ఉన్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల వద్ద గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రదేశాల వద్ద నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అతి వేగ నివారణ, హెల్మెట్ వినియోగం నిరంతర ప్రచార, అమలు జరిగే చూడాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని,ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిష్టం ద్వారా తనిఖీలు చేయాలని సూచించారు. పెండింగ్ ఫైల్స్ సీడీల పరిశీలన, కేసుల పురోగతిపై సూచనలు ఇచ్చారు. నేరాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. గంజాయి రవాణా, నాటు సారా తయారీపై ఎప్పటికప్పుడు దాడులు చేయాలన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు రౌడీ షీటర్లపై నిఘా, చెడు ప్రవర్తన కలిగిన వారి పట్ల ప్రత్యేక దృష్టి ఉంచాలని అన్నారు. సీసీటీవీల ఏర్పాటుపై ఆసక్తి, ప్రోత్సాహం కల్పించాలని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. సీఐ గణేశ్,ఎస్‌ఐలు సుధాకర్,వెంకటరావు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా
అచ్యుతాపురం పోలీస్‌స్టేషన్ సందర్శన