
400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ
మద్దిలపాలెం (విశాఖ): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏయూ పరిపాలన భవనం వద్ద నుంచి 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏయూ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఈ ర్యాలీ సిరిపురం కూడలి, ఏయూ ఇన్ గేట్ మీదుగా మళ్లీ పరిపాలన భవనం వద్ద చేరుకోవడంతో ముగిసింది. రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు, డీన్ కె.రమా సుధ, ఎస్.హరినాథ్, ఎన్.ఎం.యుగంధర్, డి.సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.