
పడకేసిన పల్లె వైద్యం
● వైద్య ఆరోగ్యశాఖలో కొరవడిన సమయపాలన ● పీహెచ్‌సీ వద్ద ఎఫ్‌ఆర్‌ఎస్ వేసి తాపీగా వెళుతున్న ఎంఎల్‌హెచ్‌పీలు ● సమయానికి తెరుచుకోని విలేజ్ క్లినిక్‌లు
గాడి తప్పిన సమయపాలన
నర్సీపట్నం: వైద్య ఆరోగ్యశాఖలో సమయపాలన కొరవడింది. అత్యవసర సేవల నిమిత్తం వైద్య ఆరోగ్యశాఖలో ముఖ ఆధారిత గుర్తింపు హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్)కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇది విలేజ్ క్లినిక్ ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలకు వరంగా మారింది. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్‌లను ఉదయం 9 గంటలకు తెరవాల్సి ఉంది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌లకు (ఎంఎల్‌హెచ్‌పీలు) విలేజ్ క్లినిక్‌లతోపాటు పీహెచ్‌సీల వద్ద ఎఫ్‌ఆర్‌ఎస్ వేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వీరు దీనిని ఆసరాగా చేసుకుని నిర్ణత సమయానికి పీహెచ్‌సీలకు చేరుకుని అక్కడ ఎఫ్‌ఆర్‌ఎస్ వేసుకుని ధీమాగా విలేజ్ క్లినిక్‌లకు వెళుతున్నారు. పీహెచ్‌సీలకు ఆయా గ్రామాల విలేజ్ క్లినిక్‌లు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. విలేజ్ క్లినిక్‌లకు వెళ్లే సరికి సమయం 10.30 నుంచి 11 గంటలు అవుతోంది. వీరు స్థానికంగా నివాసం ఉండకుండా వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎల్‌హెచ్‌పీల నిర్వాకం వల్ల గ్రామస్థాయిలో వైద్య సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేక ఆయా గ్రామాల ప్రజలు మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన పీహెచ్‌సీల వైద్యాధికారులు సైతం విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తూ సమయపాలన పాటించటం లేదు. ఇదే అదునుగా ఎంఎల్‌హెచ్‌పీలు ఇష్టానుసారంగా విధులకు హాజరువుతున్నారు.
పర్యవేక్షణ శూన్యం
జిల్లాలో 46 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 424 విలేజ్ క్లినిక్‌లు ఉన్నాయి. గ్రామస్థాయిలోనే ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఒక్కొక్క కేంద్రానికి సుమారు రూ.25 లక్షలు వెచ్చించి విలేజ్ క్లినిక్‌లను నిర్మించింది. విలేజ్ క్లినిక్‌ల ఎంఎల్‌హెచ్‌పీలు స్థానికంగా ఉండాలనే నిబంధనలు సైతం ఉన్నాయి. ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. పీహెచ్‌సీల వద్ద ఎఫ్‌ఆర్‌ఎస్ వేసుకుని ధీమాగా క్లినిక్‌లకు వెళ్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి తిరుగు ప్రయాణమై 4 గంటలకు పీహెచ్‌సీల పరిసర ప్రాంతాలకు చేరుకుని ఎఫ్‌ఆర్‌ఎస్ వేసుకుని ఇంటి ముఖం పడుతున్నారు. క్లినిక్‌ల నిర్వహణను ఆశా కార్యకర్తల మీద వదిలేస్తున్నారు. దీనిని ప్రతి రోజు ఒక దినచర్యగా మార్చుకున్నారు. వీరు క్లినిక్‌లో రెండు గంటలకు మించి ఉండటం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది సమయపాలన పాటించటం లేదు.
ఉపేక్షించేదిలేదు...
సమయపాలన పాటించని ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. విధిగా ఉదయం 9 గంటలకు విలేజ్ క్లినిక్‌లను తెరవాలి. పీహెచ్‌సీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ వేసే సిబ్బందిని గుర్తించి, జిల్లా వైద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ వీరజ్యోతి, ఏడీఎంహెచ్‌వో, నర్సీపట్నం
నర్సీపట్నం మండలం, వేములపూడి పీహెచ్‌సీ పరిధి బోడపాలెం విలేజ్ క్లినిక్ ఎంఎల్‌హెచ్‌పీ కీర్తన ఉదయం 9 గంటలకు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. వేములపూడి నుంచి బోడపాలేనికి వెళ్లాలంటే 11 కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ ఆమె బుధవారం ఉదయం 9.01 గంటలకు వేములపూడి పీహెచ్‌సీకి వెళ్లే మెయిన్ రోడ్డుపై ఎఫ్‌ఆర్‌ఎస్ వేసుకుని బోడపాలెం బయలుదేరారు. అక్కడకు సమీపంలో ఉన్న పి.కె.పల్లి వేములపూడికి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కేంద్రానికి సంబంధించిన ఎంఎల్‌హెచ్‌పీ సంతోషలక్ష్మి వేములపూడి పీహెచ్‌సీలో ఎఫ్‌ఆర్‌ఎస్ వేసుకుని 9.35 గంటలకు పి.కె.పల్లి బయలుదేరారు. ఆక్సాహేబుపేటకు వేములపూడికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కేంద్రం ఎంఎల్‌హెచ్‌పీ కూడా ప్రతిరోజు వేములపూడిలో ఎఫ్‌ఆర్‌ఎస్ వేసుకుని ఆక్సాహేబుపేట వెళుతున్నారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ఇదే తంతు నడుస్తోంది.