రక్తసిక్తం.. భయానకం
విశాఖపట్నం: నర్సీపట్నం రక్తసిక్తమయింది.. రాత్రి పూట కత్తులు చేతపట్టి వెంటపడి దాడి చేయడంతో భయానక వాతావరణం నెలకొంది.. పైశాచికానందంతో వీడియో తీస్తూ, వికటాట్టహాసం చేస్తూ, ‘మా మామయ్య మధుని (కౌన్సిలర్ మధు) తిడతా వా’ అని ఓ రౌడీ షీటర్ రంకెలేయడం నర్సీపట్నంలో అదుపు తప్పిన శాంతిభద్రతలకు తార్కాణంగా నిలిచింది. నిందితుడు అప్పలనాయుడు టీడీపీ కార్యకర్త. స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన మరో ఆరుగురితో కలిసి వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం యూత్ అధ్యక్షుడు, దళిత యువకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై శనివారం రాత్రి హత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. బలిఘట్టం నుంచి టిఫిన్ తీసుకువెళ్లేందుకు నర్సీపట్నం పాల్‌ఘాట్ సెంటర్‌కు వచ్చిన ఈశ్వరరావుపై పప్పల అప్పలనాయుడు బృందం రెండు బైక్‌లపై వచ్చి దాడికి దిగారు. సినీ ఫక్కీలో వీడియో తీస్తూ వెంటపడి కత్తులతో దాడి చేశారు. ప్రాణభయంతో పాల్‌ఘాట్ సెంటర్ నుంచి అబిద్ సెంటర్‌కు ఈశ్వరరావు పరుగులు తీశారు. మెయిన్ రోడ్డులో ఉన్న షాపులో దాక్కుంటే బయటకు లాక్కుని వచ్చి మరింత దారుణంగా కొట్టి చంపేందుకు కత్తులు తీశారు. ఈశ్వరరావు వారిని విదిలించుకుని మళ్లీ పరుగులు తీసి అంబేడ్కర్ విగ్ర హం వద్ద దాక్కున్నారు. సమాచారం అందుకున్న మొబైల్ కానిస్టేబుల్ హుటాహుటిన వచ్చి ఈశ్వరరావును కాపాడారు. కానిస్టేబుల్ ఆయనను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌చైర్మన్లు తమరాన అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, ఈశ్వరరావు అనుచరులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. సీఐ గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్వరరావు సంఘటన వివరాలను ఈశ్వరరావును అడిగి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. రౌడీ షీటర్ పప్పల అప్పలనాయుడు కొద్ది కాలం క్రితం బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావుపై హత్యా యత్నానికి పాల్పడినప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యాఖ్యానించారు.
ఈశ్వరరావును పరామర్శిస్తున్న పార్టీ నాయకులు
స్పీకర్ ఇలాకాలో హత్యా రాజకీయాలు
వైఎస్సార్‌సీపీ దళిత నేతపై కత్తులతో దాడి
రౌడీ షీటర్ పప్పల అప్పలనాయుడు ఘాతుకం
ఆరుగురితో కలిసి హత్యాయత్నం
వెంటపడి దాడి చేస్తూ వీడియో చిత్రీకరణ
రౌడీ షీటర్ అయ్యన్న కుటుంబానికి సన్నిహితుడు, టీడీపీ కార్యకర్త
రక్తసిక్తం.. భయానకం
రక్తసిక్తం.. భయానకం


