వైద్య విద్య జీవోల అమలులో పొరపాట్లు ఉండకూడదు
మహారాణిపేట (విశాఖ): మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలులో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండరాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సభ్యులు బండారు శ్రావణి, శ్రీ , కన్నా లక్ష్మీనారాయణలతో కలిసి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ నివారణ చట్టం 2017 అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ వైద్య విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల అమలు తీరును, ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మందుల పంపిణీ, ఉద్యోగ అవకాశాలు, గృహ వసతి, బీమా వంటి సౌకర్యాలపై చర్చించారు. అసెంబ్లీలో ఆమోదించిన అంశాలు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావాలని, నిబంధనల అమలులో జాప్యం జరిగితే వెంటనే సరిదిద్దాలని చైర్మన్ అధికారులకు సూచించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా ఆసుపత్రులను సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఎయిమ్స్ వంటి సంస్థలకు కేంద్రం నుంచి అందుతున్న సహకారం, పురోగతిపై కూడా చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య విద్యా విభాగం పారదర్శకంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఎల్‌ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.విశ్వనాథం, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీ సౌరబ్ గౌర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే.నీలకంఠరెడ్డి, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌డాక్టర్ పద్మావతి, డెరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు.


