కుమ్ములాటలు
టీడీపీలో
సాక్షి, అనకాపల్లి:
అనకాపల్లి టీడీపీలో కుమ్ములాటలు తార స్థాయికి చేరాయి. పచ్చనేతల మధ్య విభేదాలు రోజురోజుకు రాజుకుంటున్నాయి. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు.. అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకరిపై మరొకరు పార్టీ అధినేత దగ్గర ఫిర్యాదు చేసుకునే వరకూ వచ్చింది. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కకపోవడంతో భంగపాటుకు గురైన పీలా గోవిందు సత్యనారాయణకు అధిష్టానం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతోపాటు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగిస్తోంది. అంతేకాకుండా స్థానిక జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆయన సమీప బంధువు కావడంతో నియోజకవర్గంలో పీలా గోవిందు కాసింత స్పీడ్ పెంచారు. ఏ పని జరగాలన్నా అధికారులు సైతం పీలా గోవిందునే సంప్రదిస్తున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి.. ఒక వర్గానికే పార్టీలో పదవులు దక్కుతున్నాయని, ఇన్‌చార్జి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో జనసేన పార్టీకే కొమ్ముకాస్తున్నాడని, టీడీపీని పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తాళ్లపాలెం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ఇద్దరూ ఒకరిపై ఒకరు వేర్వేరుగా ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. ఇద్దరు మాజీల వ్యవహార శైలిపై గడిచిన కొన్ని నెలల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో నిఘా ఉంచిన చంద్రబాబు ఇద్దరికీ వేర్వేరుగా క్లాస్ తీసుకున్నట్టు భోగట్టా.
ఇద్దరు మాజీలపై సీఎం ఆగ్రహం
‘అన్నీ గమనిస్తున్నాను.. అంతా తెలుసుకున్నాను.. చేసింది చాలు ఇక ఆపండి.. తీరు మార్చుకోకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు’ అంటూ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీలో ముఖ్య నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇద్దరిపై కోపంతో ఊగిపోయారని సమాచారం. అయితే గతంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన మాజీ మంత్రి.. ఇప్పుడు మళ్లీ తమపై పెత్తనం చెలాయించడమే కాకుండా టీడీపీలో విభేదాలు సృష్టించి గ్రూపు రాజకీయాలకు తెర లేపుతున్నాడని.. అంతేకాకుండా అనకాపల్లి పట్టణ నడిబొడ్డున దౌర్జన్యంగా విలువైన భూములను కబ్జా చేస్తున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు ఇవ్వగా.. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీని గాలికి వదిలేశాడని, ఒకే కుటుంబానికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడని మాజీ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదులు విన్న చంద్రబాబు ఇద్దరిపై తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఊగిపోయారని సమాచారం. ‘మీ బాగోతాలన్నీ తెలుసు.. సమాచారం అంతా నా దగ్గర ఉంది.. అంతా చూస్తూనే ఉన్నా.. అర్జెంటుగా ప్రస్తుత వివాదాన్ని క్లియర్ చేయండి.. నేను జోక్యం చేసుకునేంతవరకు సాగదీయకండి.. తమాషాగా ఉందా’ అంటూ మాజీ మంత్రిని ఘాటుగా హెచ్చరించినట్లు అదే పార్టీలో సీనియర్ నాయకులు చెబుతున్నారు. ‘పద్ధతి మార్చుకో.. నువ్వు మార్చుకోకపోతే నేనే మార్చేస్తా.. అంతవరకు తెచ్చుకోకు.. జాగ్రత్త’ అంటూ మాజీ ఎమ్మెల్యేకు చురకలు అంటించినట్లు సీనియర్లు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ హెచ్చరికలతో ఇద్దరు మాజీలలో అధినేత చంద్రబాబుపై మరింత కోపం పెరిగింది. నిజాలు చెబుతుంటే వాటిని సరిదిద్దాలి గానీ మాపై అరుస్తున్నారెందుకు అంటూ ఇరువురు సమీప సీనియర్ నాయకుల వద్ద వాపోయినట్టు సమాచారం. సీఎం హెచ్చరికలతో ఇద్దరు మాజీల్లో మార్పు వస్తుందా..? లేదా తగ్గేదేలే అంటూ గ్రూపు రాజకీయాలు.. కబ్జాలు కొనసాగిస్తారో వేచి చూడాలంటూ టీడీపీ వర్గాలు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి.
పచ్చనేతల్లో తారస్థాయికి విభేదాలు
అనకాపల్లిలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ పోరు
జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
విలువైన భూములను కబ్జా చేస్తున్నాడని మాజీ మంత్రిపై ఆరోపణ
ఒకే కుటుంబానికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
ఇద్దరిపై చంద్రబాబు సీరియస్
ఇద్దరి బాగోతాలు తెలుసని, పద్ధతి మార్చుకోకపోతే తానే మారుస్తానని టీడీపీ అధ్యక్షుడి హెచ్చరిక
దీంతో అధినేతపైనే గుర్రుగా ఉన్న ఇద్దరు నేతలు
కుమ్ములాటలు


