గోవాడ సుగర్స్‌లో వెంటనే క్రషింగ్ ప్రారంభించాలి
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్‌ను వెంటనే ప్రారంభించాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఆవరణంలో అఖిల పక్ష నాయకుల సమావేశం సోమవారం జరిగింది. రైతు సంఘం, సీపీఐ రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులు, చెరకు రైతు సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించడంలో చోడవరం, మాడుగుల ఎమ్మెల్యే పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమావేశంలో అఖిలపక్షం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది సెప్టెంబరు 30వతేదీన నిర్వహించాల్సిన ఫ్యాక్టరీ మహాజనసభను ఇప్పటి వరకూ నిర్వహించలేదని, గత సీజన్‌కు సంబంధించిన చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ. 50 కోట్లు గ్రాంటు ఇవ్వాలని, ఈ ఏడాది క్రషింగ్ చేయడానికి కావలసిన పనులన్నీ చేపట్టాలని, వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో ఏడువాక సత్యారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అప్పలరాజు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు తాతారావు, దొడ్డి అప్పారావు, శానాపతి సత్యారావు, సూరిబాబు, పప్పల జయదేవ్, మూడెడ్ల శంకర్రావు, జెర్రిపోతుల నానాజీ, శరగడం రామునాయుడు, గణపతినాయుడు, మోహన్‌రావు, పోతల ప్రకాష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.


